Medicinal Plants | వర్షాకాలంలో చాలా మందికి సహజంగానే దగ్గు, జలుబు వంటి సమస్యలతోపాటు జ్వరాలు కూడా వస్తుంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఈ వ్యాధులు అంత సులభంగా తగ్గవు. కనుక మనం అన్ని సీజన్లలోనూ రోగ నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉండాలి. అందుకు గాను పలు రకాల మొక్కలు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేద ప్రకారం పలు రకాల మొక్కలు మనకు అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలను అందిస్తాయి. అలాంటి మొక్కల్లో కొన్నింటిని మనం ఇంట్లో పెంచుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ మొక్కలను వర్షాకాలం సీజన్లో కచ్చితంగా ఇంట్లో పెంచుకోవాలి. దీంతో ఎప్పటికప్పుడు ఆయా మొక్కల ఆకులను మనం తాజాగా సేకరించి ఉపయోగించుకోవచ్చు. ఇక మనం ఈ సీజన్లో ఇంట్లో కచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్కలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి మొక్క దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని ఆధ్యాత్మిక పరంగా ఇంట్లో పెట్టుకుంటారు. కానీ ఆయుర్వేద ప్రకారం తులసి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పలు వ్యాధులను నయం చేస్తుంది. ఒక వేళ ఆధ్యాత్మిక పరంగా ఈ మొక్కను ఇంట్లో పెంచుకోకపోయినా ఆరోగ్యం దృష్ట్యా అయినా కూడా ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలి. తులసి ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మనల్ని రోగాల నుంచి రక్షిస్తాయి. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. దగ్గు, జలుబు, జ్వరం తగ్గేలా చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తులసి ఆకులను 3 లేదా 4 తీసుకుని ఉదయం పరగడుపునే నేరుగా అలాగే తినాలి. లేదా తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను అయినా తాగవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇక పుదీనా మొక్కలను కూడా ఇంట్లో పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. రోగాలను నయం చేస్తాయి. ఈ ఆకులను వంటల్లోనూ ఉపయోగించుకోవచ్చు.
వాము మొక్కలను కూడా ఇంట్లో పెంచుకోవాలి. ఇవి జీర్ణకోశ, శ్వాసవ్యవస్థ సమస్యలను తగ్గిస్తాయి. వాము ఆకులను కూరల్లో వేసుకోవచ్చు. లేదా ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. ఈ ఆకుల రుచి ఘాటుగా ఉంటుంది కనుక నేరుగా తినలేరు. దగ్గు, జలుబు, అజీర్తి వంటి సమస్యలను తగ్గించేందుకు ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. అలాగే కలబందను కూడా ఇంట్లో కచ్చితంగా పెంచుకోవాలి. కొందరు ముళ్ల మొక్క అని చెప్పి కలబందను ఇంట్లో పెంచుకోరు. కానీ ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కలబంద ఆకుల నుంచి రసాన్ని నేరుగా సేకరించి తాజాగా వాడుకోవచ్చు. ఇందులో కొద్దిగా తేనె, నిమ్మరసం వంటివి కలిపి తాగవచ్చు. లేదా జుట్టు, చర్మానికి కూడా కలబందను ఉపయోగించవచ్చు. కలబంద వల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. జీర్ణవ్యవస్థలో ఉండే అల్సర్లు నయమవుతాయి.
లెమన్ గ్రాస్ మొక్క చిన్నగా ఉంటుంది కనుక దీన్ని కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. లెమన్ గ్రాస్ మొక్క ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. లేదా ఈ ఆకులను పేస్ట్‌లా చేసి శిరోజాలకు, చర్మానికి రాయవచ్చు. లెమన్ గ్రాస్ మొక్క ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ ఆకులతో తయారు చేసిన టీని సేవిస్తే అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జ్వరం నుంచి కోలుకుంటారు. ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కరివేపాకు మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవాలి. దీని ఆకులను వంటల్లో వేసి తినవచ్చు. లేదా ఈ ఆకుల నుంచి రసం తీసి తాగవచ్చు. వీటిని నేరుగా తినవచ్చు. ఈ ఆకుల రసాన్ని మజ్జిగలో కలిపి సేవించవచ్చు. కరివేపాకును తీసుకుంటున్నా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. ఇలా ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే అన్ని సీజన్లలోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.