Capsicum | మార్కెట్ లో మనకు మూడు రకాలకు చెందిన క్యాప్సికం లభిస్తాయి. ఆకుపచ్చ, పసుపు రంగు, ఎరుపు రంగులో ఉండే క్యాప్సికమ్ మనకు లభిస్తుంది. అయితే పసుపు, ఎరుగు రంగు క్యాప్సికం ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక చాలా మంది కేవలం ఆకుపచ్చ రంగు క్యాప్సికమ్‌ను మాత్రమే తింటుంటారు. అయితే క్యాప్సికంను చాలా మంది కేవలం బిర్యానీ వంటకాలు లేదా మసాలా వంటకాల్లో మాత్రమే వేస్తుంటారు. కానీ దీన్ని రోజూ తినవచ్చు. క్యాప్సికమ్‌ను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు క్యాప్సికమ్‌లో ఉంటాయి. క్యాప్సికంను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.
100 గ్రాముల ఆకుపచ్చ క్యాప్సికం ద్వారా మనకు సుమారుగా 20 క్యాలరీ శక్తి మాత్రమే లభిస్తుంది. కనుక అధిక బరువు తగ్గాలనుకునే వారికి క్యాప్సికం మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా క్యాలరీలు ఎక్కువగా చేరవు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. క్యాప్సికంను తింటే మనకు ప్రోటీన్లు 0.86 గ్రాములు, కొవ్వులు 0.17 గ్రాములు, ఫైబర్ 1.7 గ్రాములు లభిస్తాయి. అలాగే వీటిని తినడం వల్ల క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్లు సి, ఎ, ఇ లభిస్తాయి. ఇలా ఎన్నో రకాల పోషకాలకు ఇవి నెలవు కనుక క్యాప్సికంను తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల క్యాప్సికంను తింటే సుమారుగా 80.4 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. దీంతో దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో చర్మం పగిలే సమస్య ఉన్నవారు క్యాప్సికమ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వల్ల చర్మం పొడిబారదు. తేమగా ఉంటుంది. మృదువుగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.
ఆకుపచ్చ క్యాప్సికంను తినడం వల్ల విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. రేచీకటి సమస్య ఉన్నవారు క్యాప్సికమ్‌ను తరచూ తింటుంటే ఫలితం ఉంటుంది. ఇక వీటిలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఇలా క్యాప్సికంను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని రోజూ నేరుగా తినవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.