Olive Oil | మార్కెట్లో మనకు చాలా రకాల ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ స్థోమత, అభిరుచికి తగినట్లు పలు రకాల ఆయిల్స్ ను వంటలకు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తుంటారు. అయితే మీకు తెలుసా..? నూనెలన్నింటిలోనూ అత్యంత ఆరోగ్యకరమైన నూనె ఒకటుందని. అవును, అదే. ఆ నూనె మరేదో కాదు, ఆలివ్ ఆయిల్. దీని గురించి చాలా మందికి తెలుసు. కానీ ఆలివ్ ఆయిల్ అసలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి..? అన్న వివరాలు చాలా మందికి తెలియదు. పోషకాహార నిపుణులు ఈ విషయాలనే వెల్లడిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. ఆలివ్ ఆయిల్‌ను పూర్తిగా కంప్రెస్ చేసిన విధానంలో సహజసిద్ధంగా తయారు చేస్తే దాన్ని ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అంటారు. ఇది మనకు మార్కెట్లో లభిస్తుంది. సాధారణ ఆలివ్ ఆయిల్ కన్నా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మనకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని వాడడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
ఆలివ్ ఆయిల్లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఈ ఆయిల్లో ఓలియిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనెలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె కండరాలు, రక్త నాళాలు వాపులకు గురి కాకుండా అడ్డుకోవచ్చు. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా వచ్చే వాపులను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆలివ్ ఆయిల్ లో ఉండే పాలిఫినాల్స్ వాపులను తగ్గించడంలో సహాయం చేస్తాయి. కనుక శరీరంలో ఉండే కండరాల నొప్పులు, వాపుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. కనుక ఒళ్లు నొప్పులు ఉన్నవారు దీన్ని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఇవి మెదడు కణాలను రక్షిస్తాయి. దీంతో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ఆలివ్ ఆయిల్లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు మెదడులో ఉండే వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ నూనెను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఆలివ్ ఆయిల్‌ను ఎన్నో సంవత్సరాల నుంచి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రోజూ తీసుకుంటుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పైత్య రసం సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్దకం తగ్గిపోతుంది. కనుక ఆలివ్ ఆయిల్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు. దీన్ని వంటల్లో వాడవచ్చు లేదా నేరుగా అలాగే తీసుకోవచ్చు. సలాడ్స్, సూప్‌లలో పైన చల్లి కూడా తీసుకోవచ్చు.