Foods To Kids | మనం తినే ఆహారంలో అన్ని పోషకాలు ఉన్నాయా, లేదా.. అని చూసుకోవడం మాత్రమే కాదు, పిల్లలకు కూడా అన్ని పోషకాలు లభిస్తున్నాయా.. లేదా.. అనే విషయాన్ని కూడా పరిశీలించాలి. వారికి పెట్టే ఆహారంలో విటమిన్లు, మినరల్స్తోపాటు ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు, ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివన్నీ లభిస్తున్నాయా, లేదా అనేది చూసుకోవాలి. వారికి సమతుల ఆహారాన్ని అందించినప్పుడే వారు చదువుల్లో రాణిస్తారు. తెలివి తేటలు పెరుగుతాయి. అలాగే క్రీడల్లోనూ ప్రతిభ చూపిస్తారు. కనుక పిల్లల ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలను పాటించాలి. చిన్నారుల శరీరం పెరిగేందుకు ప్రోటీన్లు ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కనుక ప్రోటీన్లను అధికంగా ఇవ్వాలి.
గాయాలు తగిలినప్పుడు ప్రోటీన్లను ఎక్కువగా అందిస్తే త్వరగా కోలుకుంటారు. కోడిగుడ్లు, పప్పు దినుసులు, చికెన్, మటన్, బాదంపప్పు, చిక్కుడు జాతి గింజలు, మొలకెత్తిన విత్తనాలు వంటి వాటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే తక్షణ శక్తి కోసం పిండి పదార్థాలను కూడా అందించాలి. చిరు ధాన్యాలు, బియ్యం, గోధుమలు వంటివి ఈ కోవకు చెందుతాయి. మీ పిల్లలకు పిండి పదార్థాలు లభించాలంటే ఓట్స్ కూడా ఇవ్వవచ్చు. ఇక పిల్లలకు కొవ్వు పదార్థాలతోనూ ఎంతో మేలు జరుగుతుంది. శరీరంలోని ముఖ్య భాగాలైన మూత్రపిండాలు, గుండె లాంటి వాటికి కొవ్వులు అవసరం అవుతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తినాలి. వెన్న, నెయ్యి, పాలు, పల్లీలు, గింజలు, విత్తనాలు వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని కూడా చిన్నారులకు రోజూ ఇవ్వాలి.
పిల్లలకు కచ్చితంగా రోజుకు 1 కోడిగుడ్డును ఇవ్వాలి. ఇది వారికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. రోజుకు ఒక కోడిగుడ్డును పిల్లలకు తినిపిస్తే వారికి పోషణ సమృద్ధిగా లభిస్తుంది. గుడ్డులో మన శరీరానికి కావల్సిన పోషకాలు దాదాపుగా అన్నీ ఉంటాయి. కనుక పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుందన్న భయం ఉండదు. కోడిగుడ్డులో 11 రకాల ఆమ్లాలు ఉంటాయి. ఇవి పిల్లల పెరుగుదలకు ఎంతో దోహదం చేస్తాయి. కనుక రోజుకు ఒక కోడిగుడ్డును వారికి తినిపించాలి. అలాగే పిల్లలకు మినరల్స్ కూడా అందేలా చూడాలి. మినరల్స్ వల్ల వారిలో ఎముకలు, దంతాలు సరిగ్గా, ఆరోగ్యంగా పెరుగుతాయి. శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. మినరల్స్ లోపం ఏర్పడితే వారిలో ఎముకలు బలహీనంగా మారే చాన్స్ ఉంటుంది. అలాగే రక్తం తగ్గుతుంది. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా ఉండదు. వారు ఎల్లప్పుడూ చురుగ్గా ఉండలేరు. బద్దకంగా ఉంటారు. ఈ లక్షణాలన్నీ మినరల్స్ లోపాన్ని తెలియజేస్తాయి. అలాంటి పిల్లలకు మినరల్స్ ఉండే ఆహారాలను ఇస్తే ఫలితం ఉంటుంది.
మినరల్స్ ఎక్కువగా మాంసం, గుడ్లు, చేపలు, పాలు, కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, ఖర్జూరా, నట్స్, విత్తనాల్లో ఉంటాయి. వీటిని పిల్లలకు రోజూ తినిపిస్తే మేలు జరుగుతుంది. అలాగే పిల్లలకు సరైన మోతాదులో అయోడిన్ లభించేలా చూడాలి. అయోడిన్ థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా ఉండేలా చూస్తుంది. అయోడిన్ లభించకపోతే పిల్లలకు భవిష్యత్తులో థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయోడిన్ ఎక్కువగా చేపలు, కోడిగుడ్లు, రొయ్యలు తదితర ఆహారాల్లో లభిస్తుంది. అలాగే మొలకెత్తిన విత్తనాలను కూడా పిల్లలకు రోజూ పెట్టాలి. దీంతో ప్రోటీన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి వారి శరీర నిర్మాణానికి, రోగ నిరోధక వ్యవస్థ పటిష్టతకు దోహదం చేస్తాయి. ఇలా ఆయా ఆహారాలను పిల్లలకు తినిపిస్తుంటే వారు ఎంతో చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా చదువుతారు, క్రీడల్లోనూ యాక్టివ్గా పాల్గొంటారు. శరీరంలో శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. తెలివి తేటలు కూడా పెరుగుతాయి.