Immunity In Kids | సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. చిన్నారులకు అయితే తరచూ ఈ సమస్యలు వస్తాయి. ఎల్లప్పుడూ వారు జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. అయితే వారు తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే దాంతో వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాని వల్ల వారికి దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచితే వారికి ఎలాంటి రోగాలు రాకుండా చూడవచచు. అందుకు గాను పలు ఆహారాలను తరచూ ఇవ్వాల్సి ఉంటుంది. వాటితో ఇమ్యూనిటీ పెరగడమే కాదు, వారి శరీరానికి కావల్సిన పోషకాలు, శక్తి కూడా లభిస్తాయి. ఇక చిన్నారుల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సిట్రస్ జాతికి చెందిన పండ్లను ఇస్తుంటే చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్ వంటి పండ్లను వారికి ఇస్తుండాలి. వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీలను కూడా ఇవ్వవచ్చు. వీటిల్లో విటమిన్ సి తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతాయి. ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకుకూరలను కూడా పిల్లలకు పెడుతుండాలి. పాలకూర, బ్రోకలీ వంటి కూరగాయల్లో విటమిన్లు ఎ, సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చిలగడదుంపలలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఈ ఆహారాలను పిల్లలకు తినిపిస్తే వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు.
కోడిగుడ్లలో ప్రోటీన్లతోపాటు విటమిన్ ఎ, బి12 సెలీనియం అధికంగా ఉంటాయి. జింక్ కూడా పుష్కలంగానే ఉంటుంది. కోడిగుడ్లను రోజుకు ఒకటి చొప్పున పిల్లలకు ఇస్తుండాలి. ఇవి వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చికెన్, చేపల్లోనూ ప్రోటీన్లు, జింక్ ఎక్కువగానే ఉంటాయి. ఇవి కూడా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. తరచూ వీటిని పిల్లలకు ఆహారంలో పెడుతుండాలి. బాదంపప్పు, వాల్ నట్స్ వంటి నట్స్‌తోపాటు చియా సీడ్స్, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటి విత్తనాలను కూడా పిల్లలకు పెట్టాలి. వీటిల్లో విటమిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి చిన్నారుల ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి.
పెరుగు మంచి ప్రొ బయోటిక్ ఆహారం. దీన్ని పిల్లలకు రోజూ పెట్టాలి. కొందరు పిల్లలు పెరుగు తినేందుకు ఇష్టపడరు. అలాంటప్పుడు నేరుగా దాన్ని పెట్టకుండా అందులో కాస్త చక్కెర లేదా పండ్ల ముక్కలు కలిపి ఇవ్వాలి. దీంతో వారు పెరుగును ఇష్టంగా తింటారు. పెరుగు జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇది పిల్లల్లో జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. వెల్లుల్లి, అల్లం వంటి ఆహారాలను కూడా పిల్లలకు ఇస్తుండాలి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను పిల్లలకు పెట్టడం వల్ల వారిలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచవచ్చు. వారిలో వ్యాధులు రాకుండా చూడవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.