ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి వాతావరణంలో విపరీతమైన వేడి, ఆహార పదార్థాలు తొందరగా పాడైపోవడం, కలుషితమైన నీళ్లు మొదలైన వాటి కారణంగా పొట్టలో గడబిడ తలెత్తడం సాధారణమే. విరేచనాలు, కడుపునొప్పి బాధిస్తుంటాయి. ఇలాంటప్పుడు వైద్య సహాయానికి ముందు కొన్ని వంటింటి చిట్కాలు అనుసరిస్తే మంచిది.
మన వంటిళ్లలో వాము తప్పకుండా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్టలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. కడుపునొప్పి నుంచి సత్వర ఉపశమనానికి ఓ టీ స్పూన్ వాము, చిటికెడు నల్లుప్పు కలిపి వేడినీటితో తీసుకుంటే మంచిది. ఇది పొట్టలో గ్యాస్‌ను బయటికి
పంపుతుంది. కడుపునొప్పి నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది.
పెరుగులో ప్రొబయోటిక్స్ పుష్కలం. అలా పెరుగు మన పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహకరిస్తుంది. విరేచనాలు, అతిసారం తగ్గడానికి దోహదపడుతుంది. పెరుగును ఇసాబ్గోల్తో కలిపి తీసుకుంటే పేగుల్లో అధికంగా ఉన్న నీళ్లను లాగేసుకుంటుంది. మలం గట్టిపడేలా చేస్తుంది. కప్పెడు పెరుగులో టేబుల్ స్పూన్ ఇసాబ్గోల్ వేసి బాగా కలపాలి. భోజనం తర్వాత దీన్ని తీసుకోవాలి.
అల్లంలో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది వికారం, అజీర్ణం తదితర సమస్యలను తగ్గించడంలో సహకరిస్తుంది. తాజా అల్లం ముక్క నమిలినా, అల్లం టీ తాగినా పొట్ట సమస్యకు ఫలితం కనిపిస్తుంది. కడుపునొప్పిని తగ్గించడంలో పుదీనా కూడా గొప్పగా పనిచేస్తుంది. నీళ్లలో పుదీనా రసం, అల్లం రసం, నిమ్మరసంతోపాటు చిటికెడు నల్లుప్పు కలుపుకొని తాగాలి. కడుపులో అసౌకర్యం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడటానికి, కడుపు ఉబ్బరం తగ్గడానికి సోంపు కూడా మంచి ఔషధం. కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు టేబుల్ స్పూన్ సోంపు నమలడం, లేదంటే నీళ్లలో మరిగించి తాగడం చేయాలి. సోంపును రాత్రంతా నీళ్లలో నానబెట్టి మర్నాడు ఉదయమే తీసుకున్నా కడుపునొప్పి, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది.
పొట్టలో నీరసంగా ఉన్నప్పుడు బరువైన ఆహారం తింటే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇలాంటప్పుడు చల్లారిన గంజినీళ్లు తాగితే మలం గట్టిపడుతుంది. డీహైడ్రేషన్ తగ్గుతుంది. లేదంటే కిచిడీ, పెరుగు లాంటి తేలికపాటి ఆహారం తిన్నా కూడా ఫలితం ఉంటుంది. ఇవి తేలిగ్గా అరిగిపోవడమే కాకుండా పొట్టకు ఇబ్బంది కలిగించకుండానే శరీరానికి తగినంత సత్తువను ఇస్తాయి.