Ginger And Turmeric Water | చలికాలం ఇంకా ఆరంభంలోనే ఉంది. అయినప్పటికీ చలి తీవ్రత విపరీతంగా ఉంది. అనేక చోట్ల 10 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తమ శరీరాలను వెచ్చగా ఉంచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో పలు మార్పులు చేసుకుంటున్నారు. శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలతోపాటు ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను కట్టడి చేసేందుకు కూడా పలు ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఆహారాల విషయానికి వస్తే అల్లం, పసుపు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయని వైద్యులు అంటున్నారు. ఈ సీజన్లో ఉదయాన్నే అల్లం రసంలో కాస్త పసుపు కలిపి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. లేదా నీటిలో అల్లం వేసి మరిగించి అందులో కాస్త పసుపు కలిపి తాగాలని అంటున్నారు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు.
రోజూ ఉదయం పరగడుపునే నీటిలో అల్లం వేసి మరిగించి అనంతరం అందులో కాస్త పసుపు వేసి కలిపి తాగితే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని కఫం మొత్తం కరిగిపోతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. చలికాలంలో నరాలు అన్నీ బిగుసుకుపోయి సాధారణంగానే చాలా మందికి కీళ్లు, మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అయితే దీన్ని నివారించేందుకు గాను అల్లం, పసుపు నీళ్లు ఎంతో దోహదపడతాయి. ఈ నీళ్లను రోజూ పరగడుపునే తాగుతుంటే కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
చలికాలంలో అందరి చర్మం పగులుతుంది. దీంతో అంద విహీనంగా చర్మం కనిపిస్తుంది. అయితే ఇందుకు గాను ఖరీదైన క్రీములు, గట్రా రాయాల్సిన పనిలేదు. ఉదయాన్నే పరగడుపునే అల్లం, పసుపు నీళ్లను తాగితే చాలు, చర్మానికి తేమ లభించి మృదువుగా మారుతుంది. చర్మం పగలడం తగ్గుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. చర్మం ప్రకాశిస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. శరీరంలోని వాపులను తగ్గించడంలోనూ ఈ నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. చలికాలంలో వచ్చే వాపులను తగ్గించుకునేందుకు ఉదయాన్నే అల్లం, పసుపు నీళ్లను తాగాల్సి ఉంటుంది.
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. ఫలితంగా క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. పసుపులోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. రోజూ ఉదయం అల్లం, పసుపు నీళ్లను తాగడం వల్ల గుండెకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. గుండె పనితీరు మెరుగు పడుతుంది. ఇలా చలికాలంలో అల్లం, పసుపు నీళ్లను తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.