గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) ప్రస్తుతం తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో గుబులు పుట్టిస్తున్న వ్యాధి. లక్ష మందిలో నలుగురు ఐదుగురికి వచ్చే అవకాశం ఉన్న అరుదైన వ్యాధి జీబీఎస్. అయితే, ఇది గతంలోని మాట. ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించే ఈ వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారినీ ఇది కుదిపేస్తున్నది. రోగి చూడ్డానికి ఆరోగ్యంగానే కనిపిస్తాడు. వైద్య పరీక్షల్లో వైటల్స్ నర్వ్, బీపీ తదితరాలు అన్నీ సాధారణంగానే ఉంటాయి. అయినప్పటికీ రోగి చాలా బలహీనంగా, అశక్తుడిగా మారతాడు. కాళ్లూ, చేతులు, మెడ కండరాలతోపాటు… ఒకోసారి తలలోని కండరాలూ అచేతనంగా మారడంతో కళ్లు కూడా మూసుకోలేని స్థితికి చేరుకుంటాడు.
GBS | జీబీఎస్ పాత రోగమే. పైగా ఇది అంటువ్యాధి కూడా కాదు. ఒకరి నుంచి ఇంకొకరికి సోకే అవకాశం ఏమాత్రం లేదు. ఇది నాడులకు సంబంధించిన ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇందులో 4 వేరియంట్లు ఉంటాయి. అవి… 1. ఏఐడీపీ, 2. ఏఎంఏఎన్, 3. ఏఎంఎస్ఏఎన్, 4. ఎంఎఫ్ఎస్. అయితే, వీటిలో కూడా ఏఐడీపీ వేరియంట్ మాత్రమే ఎక్కువమందిలో కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో కూడా ఈ వేరియంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం జీబీఎస్ రోగుల్లో దేశవ్యాప్తంగా రెండు మూడు మరణాలు కూడా సంభవించడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) రావడానికి గల కారణాలేంటి? వ్యాధిని ఎలా గుర్తించాలి? అందుబాటులో ఉన్న చికిత్స పద్ధతులేంటి? తదితర అంశాల గురించి అవలోకనం చేసుకుందాం.
ఈ వేరియంట్ సాధారణంగా ఎక్కువమందిలో కనిపిస్తున్నది. దీనివల్ల కండరాలు చచ్చుబడిపోతాయి. శరీరంలో ఉన్న ఇమ్యూన్ మెకానిజం దెబ్బతిని ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీంతో నాడీకణాలకు తొడుగులా ఉండే మైలిన్ పొర దెబ్బతింటుంది. మైలిన్ పొర విద్యుత్ ప్రచోదనాలను ఒక నాడి నుంచి మరో నాడికి చేరవేస్తుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ మైలిన్ పొర దెబ్బతింటుంది. ‘కాంపైలోబ్యాక్టర్’ అనే బ్యాక్టీరియా గ్యాస్ట్రో ఎంటరైటిస్కు కారణమవుతుంది. చాలామంది జీబీఎస్ బాధితుల్లో ‘కాంపైలోబ్యాక్టర్’ ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. కాకపోతే, ఈ బ్యాక్టీరియా వల్లనే జీబీఎస్ వస్తుందనేది మాత్రం ఎక్కడా రుజువు కాలేదు.
ఇది కూడా ఎవరిలోనైనా రావచ్చు. దీనికి కూడా ప్రత్యేక కారణం లేదు.
ఇందులో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రోగి కోలుకునే (రికవరీ రేటు) అవకాశం తక్కువగా ఉంటుంది. విపరీతమైన నొప్పి ఉంటుంది. కొంతమందిలో మూత్ర విసర్జన నిలిచిపోతుంది. మలబద్ధకం ఏర్పడుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఇది అందరిలో ఉంటుంది. శ్వాస, పల్స్ రేట్లో కూడా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ వేరియంట్లో రోగి ఊపిరితిత్తుల్లోని నాడులు పక్షవాతానికి గురై, శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఫలితంగా రోగి మరణించే ప్రమాదం పొంచి ఉంటుంది.
ఈ వేరియంట్లో కంటిచూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ వేరియంట్‌కు గురైన రోగులు తూలుతూ నడుస్తారు. కంటిలో కండరాలు కూడా ఆఫ్తాల్మో ప్లీజియాకు గురవుతాయి. దీనివల్ల బొమ్మ రెండుగా కనిపిస్తుంది. కనుగుడ్డు కదలదు. ఇవన్నీ చాలా అరుదు.
జీబీఎస్ రావడానికి కచ్చితమైన కారణాలంటూ ఏమీ లేవు. ఈ రుగ్మత పుట్టిన 3 నెలల వయసు నుంచి ఇతర అన్ని వయసుల వారికీ వస్తుంది. కానీ, ఎక్కువగా 30 45 ఏండ్ల మధ్య, 50 65 ఏండ్ల మధ్య వయసు వారిలో జీబీఎస్ ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం వరకు డయేరియా, శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లు వచ్చిపోయిన రెండు నుంచి నాలుగు వారాల తర్వాత జీబీఎస్ బాధించే అవకాశాలు ఎక్కువ. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య కొంత ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులు బయట తిరగడం, ఇన్ఫెక్షన్లకు గురవడం వంటివి కారణాలుగా కనిపిస్తాయి.
సాధారణంగా చలికాలం నుంచి ఎండకాలానికి, ఎండకాలం నుంచి వానకాలానికి మారిన సమయంలో జీబీఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే, ఇది ఎప్పుడైనా రావచ్చనే విషయం గుర్తుంచుకోవాలి. కాకపోతే రుతువు మారినప్పుడు వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది. జీబీఎస్ రోగి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నాడులు మన శరీర అవయవాలకు విద్యుత్ కనెక్షన్లలా పనిచేస్తాయి. ఒక్కసారి నాడులు దెబ్బతినగానే విద్యుత్ ప్రసారంలో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా సంబంధిత అవయవాలు పనిచేయడం మానేస్తాయి.
సాధారణంగా మనిషిలో ప్రతి అవయవాన్ని మెదడు నియంత్రిస్తుంది. మెదడు నుంచి శరీరంలో అన్ని భాగాలకూ నాడుల ద్వారా సమాచారం బదిలీ అవుతూ ఉంటుంది. ఈ కారణంగానే మనం పరిస్థితులకు అనుగుణంగా కాళ్లు, చేతులతోపాటు అన్ని అవయవాలనూ కదిలిస్తుంటాం. ఈ నాడులపై ‘మైలిన్’ అనే పొర ఉంటుంది. ఈ పొర ద్వారానే కదలికలకు సంబంధించిన సమాచారమంతా విద్యుత్ సిగ్నల్స్ ద్వారా వెళ్తూ, వస్తూ ఉంటుంది. వీటి ఆధారంగానే మన కండరాలు కదులుతుంటాయి. మైలిన్ ధ్వంసమైనప్పుడు విద్యుత్ సిగ్నల్స్ ఆగిపోతాయి. దీంతో నాడులు దెబ్బతిని అవయవాలు పనిచేయడం మానేస్తాయి.
మైలిన్ పొర దెబ్బతినడంతో మొదటగా పొడవైన నాడులు దెబ్బతిని పనిచేయడం మానేస్తాయి. అందుకే, ఈ రుగ్మత వచ్చిన వెంటనే పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితం అవుతాయి. ఫలితంగా జీబీఎస్ సిండ్రోమ్‌లో మొట్టమొదట కాళ్లు చచ్చుబడిపోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత అది క్రమంగా పైకి పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే… వీపు, చేతులు, మెడ కండరాలు, చివరగా ముఖ కండరాలు ప్రభావితమవుతాయి. ఇలా రోగి శరీరం పూర్తిగా అచేతనమైపోతుంది. రెండుకాళ్లూ, రెండుచేతులూ చచ్చుబడిపోయినట్టుగా ఉంటాయి. అయినప్పటికీ రోగి శరీరంలో ప్రధాన అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తుంటాయి. అయితే, బాగానే ఉన్నాం కదా అని వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ కండరాలు కూడా ప్రభావితమవుతాయి. దాంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అప్పుడు వెంటిలేటర్ అవసరం పడుతుంది. దీంతోపాటు గొంతు కండరాలు సైతం ప్రభావితం కావడంతో మాట్లాడటం, మింగడం కష్టమైపోతాయి.
జీబీఎస్ ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. సాధారణంగా ప్రతీ వైరస్ చుట్టూ ప్రొటీన్లు ఉంటాయి. ఏదైనా వైరస్ ఎవరి శరీరంలోనైనా ప్రవేశించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. వైరస్‌పై ఉండే ప్రొటీన్లపై దాడిచేస్తుంది. ఆ వైరస్‌ను చంపేస్తుంది. ఈ క్రమంలో రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) రోగి శరీరంలో నాడులపై ఉండే ప్రొటీన్లను వైరస్‌కు సంబంధించిన శత్రు ప్రొటీన్లుగా భావిస్తుంది. అలా వాటిపై దాడికి దిగుతుంది. దీనివల్ల నాడులపైన ఉండే ‘మైలిన్’ పొర దెబ్బతింటుంది. దాంతో ఈ విద్యుత్ సిగ్నళ్ల ప్రసారానికి అంతరాయం ఏర్పడుతుంది. కండరాలు తమ కదలికలను కోల్పోతాయి. ఫలితంగా రోగి అచేతనంగా మారిపోతాడు. కొన్నిచోట్ల నాడులపై మైలిన్ పొర ఉండదు. అలాంటి ప్రదేశంలో ఆటో ఇమ్యూన్ దాడి జరిగినప్పుడు వివిధ రకాల జీబీఎస్ వేరియంట్లు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది.
తొలుత సాధారణ రక్తపరీక్ష చేసి అందులో పొటాషియం, కాల్షియం స్థాయులను, క్రియాటినిన్ స్థాయిని పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే నర్వ్ కండక్షన్ పరీక్షల ద్వారా జీబీఎస్‌ను నిర్ధారణ చేస్తారు. అయితే, ఈ పరీక్ష ద్వారా వ్యాధి తీవ్రతను కచ్చితంగా చెప్పలేం. కొన్నిసార్లు వెన్ను నుంచి నీరు తీసి చేసే సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) పరీక్ష కూడా అవసరం కావచ్చు. రోగ లక్షణాల ఆధారంగా క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
దీనిలో రోగి నాడులపై విద్యుత్ ప్రసారం చేస్తారు. ఈ పరీక్షలో నాడుల పనితీరు తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ పద్ధతిలో సమస్యను సరిగ్గా నిర్ధారించలేం. అందువల్ల లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.
శరీరం బరువు ఆధారంగా మోతాదు నిర్ణయించి ఐదు రోజులపాటు ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లను ఇవ్వడం ఒక రకమైన చికిత్స. ఇవి శరీరంలోని యాంటీబాడీస్ మనకు వ్యతిరేకంగా పనిచేయకుండా అడ్డుకుంటాయి. అంటే యాంటీబాడీస్‌ను బ్లాక్ చేస్తాయి. తద్వారా నాడుల మీద ఉండే మైలిన్ పొర మరింత ధ్వంసం కాకుండా నివారిస్తాయి.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ రాజారావు
జనరల్ ఫిజీషియన్, సూపరింటెండెంట్
యాదాద్రి-భువనగిరి ప్రభుత్వ దవాఖాన