Gastric Headache | కొంతమందిని తలనొప్పి తరచుగా బాధిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనిషిని పడుకోనీయదు, అలాగని లేస్తే కుదురుగా ఉండనీయదు. ఇది గ్యాస్ట్రిక్ తలనొప్పి కావొచ్చు అంటున్నారు వైద్యులు. గ్యాస్ట్రిక్ తలనొప్పి పొట్టకు సంబంధించిన సమస్య. కడుపులో గ్యాస్ ఏర్పడ్డప్పుడు అది క్రమంగా తలకు పాకుతుంది. అలా తలనొప్పి మొదలైపోతుంది. అజీర్ణం, జీర్ణశక్తి తక్కువగా ఉండటం, పొట్ట, పేగులకు సంబంధించిన సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది.
తలనొప్పితోపాటు… వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడటం, అజీర్ణం, పొట్టలో ఆమ్లం అన్నవాహికలోకి రావడం, విరేచనాలు లేదంటే మలబద్ధకం మొదలైనవి కలిసి బాధిస్తే అది గ్యాస్ట్రిక్ తలనొప్పి. పాచిపోయిన ఆహారం, పరిమితికి మించి తినడం, మసాలా తిండ్లు, తగినన్ని నీళ్లు తాగకపోవడం, మహిళల్లో నెలసరి సమయంలో, గర్భంతో ఉన్నప్పుడు హార్మోన్ల సమతూకంలో తేడాల వల్ల ఈ సమస్య వస్తుంది.
గ్యాస్ట్రిక్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటిచిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది. అవి పెప్పర్మింట్ టీ తాగడం, ఆరేడు తులసి ఆకులు నమలడం, గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకోవడం, సోంపు తినడం, బటర్‌మిల్క్ తాగడం లాంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. వేళకు తినాలి. మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి.