Gas Trouble Home Remedies | గ్యాస్ ట్రబుల్ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే గ్యాస్ అధికంగా ఉత్పత్తి అయ్యేది. ఎందుకంటే వారు శారీరక శ్రమను తగ్గించేవారు కనుక. కానీ ఇప్పుడు అసలు శారీరక శ్రమ ఉండడం లేదు. దీంతో చిన్నారుల్లో సైతం గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తోంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున గ్యాస్ సమస్యతో సతమతం అవుతున్నారు. దీంతో నలుగురిలో ఉన్నప్పుడూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చాలా మంది మెడికల్ స్టోర్‌కు వెళ్లి మందులను కొని తెచ్చి వేసుకుంటారు. కానీ ఆ అవసరం లేదు. పలు ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు, గ్యాస్ సమస్య ఇట్టే తగ్గిసోతుంది. అందుకు గాను ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
గ్యాస్ సమస్య ఉన్నవారు భోజనం చేసిన అనంతరం కచ్చితంగా గుప్పెడు మోతాదులో సోంపు గింజలను నోట్లో వేసుకుని నమిలి తింటుండాలి. సోంపు గింజల్లో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ గింజలు జీర్ణ వ్యవస్థలో అధికంగా ఉండే గ్యాస్‌ను సులభంగా బయటకు పంపుతాయి. జీర్ణాశయ కండరాలను ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. సోంపు గింజలను తినలేం అనుకుంటే వాటిని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను కూడా తాగవచ్చు. అయితే భోజనం చేసిన తరువాత 30 నిమిషాలు ఆగి ఈ నీళ్లను తాగాలి. అదే సోంపు గింజలు అయితే భోజనం చేసిన వెంటనే తినవచ్చు. ఇక అల్లం కూడా జీర్ణ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను తినాలి. లేదా అల్లం రసం సేవించవచ్చు. భోజనం చేసిన తరువాత 30 నిమిషాలకు అయితే అల్లం వేసి మరిగించిన నీళ్లను తాగవచ్చు. దీంతో గ్యాస్ పోతుంది.
గ్యాస్ సమస్యను తగ్గించడంలో వాము కూడా బాగానే పనిచేస్తుంది. వాములో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. పురాతన కాలం నుంచి వామును జీర్ణ సమస్యలు తగ్గేందుకు ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో వాముకు ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. అర టీస్పూన్ వాము గింజలను భోజనం చేసిన తరువాత నేరుగా నోట్లో వేసుకుని నమిలి తింటుండాలి. వీలుంటే కాస్త నల్ల ఉప్పుతో కలిపి తినాలి. లేదా వాము గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. ఇలా చేసినా కూడా గ్యాస్ తగ్గిపోతుంది. జీలకర్ర కూడా గ్యాస్‌ను పూర్తిగా తగ్గిస్తుంది. జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను ఒక కప్పు మోతాదులో భోజనం చేసిన 30 నిమిషాల అనంతరం తాగుతుండాలి. జీలకర్ర నీళ్లను ఉదయం పరగడుపున లేదా రాత్రి నిద్రకు ముందు కూడా తాగవచ్చు. దీంతో కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు.
పెప్పర్‌మింట్‌లో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. కనుక ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా జీర్ణాశయ కండరాలు ప్రశాంతంగా మారేలా చేస్తుంది. దీంతో గ్యాస్ సులభంగా బయటకు పోతుంది. భోజనం చేసిన తరువాత 30 నిమిషాలు ఆగి ఒక కప్పు పెప్పర్మింట్ టీని సేవిస్తుండాలి. దీని వల్ల జీర్ణాశయంలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. గ్యాస్ తగ్గుతుంది. అలాగే ఆహారంలో ఇంగువను చేర్చుకోవాలి. భోజనం చేసే సమయంలో కూరలపై ఇంగువను చల్లి తింటుంటే గ్యాస్ మాత్రమే కాదు, ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా పలు ఇంటి చిట్కాలను పాటిస్తే గ్యాస్ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.