Fungal Sinusitis | ముక్కు పక్క భాగంలోని ఎముకల్లో ఉండే సన్నటి గాలితో నిండిన ప్రదేశం ఇన్ఫెక్షన్కు గురైతే దాన్ని సైనసైటిస్ అంటాం. మనలో 90 శాతం మంది ఈ సమస్య బారిన పడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. వైరస్, బ్యాక్టీరియా మరీ ముఖ్యంగా స్టెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల సైనసైటిస్ వస్తుంది. ముక్కు, సైనస్లలో నాసికా పాలిప్స్ ఏర్పడటం వల్ల కూడా సైనసిటిస్కు దారితీస్తుంది. వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనకారులు తేల్చారు. కొవిడ్ వ్యాప్తి సమయంలో ఇన్వేసివ్ ఫంగల్ సైనసైటిస్ కేసుల సంఖ్యలో ఒకేసారి పెరుగుదల కనిపించింది.
ఫంగల్ సైనసైటిస్ అనేది బాక్టీరియల్, వైరల్ సైనసైటిస్ కంటే తక్కువ సాధారణమైంది. అయితే, ఈ వ్యాధికి చికిత్స చేయడం చాలా కష్టమైన. అక్యూట్ ఫుల్మినెంట్, క్రానిక్, ఇన్వాసివ్ ఫంగల్ సైనసైటిస్‌తో పాటు అనేక రకాల ఫంగల్ సైనసైటిస్‌లు ఉన్నాయి. అక్యూట్ ఫుల్మినెంట్ ఫంగల్ సైనసైటిస్ అనేది ఎయిడ్స్ లేదా డయాబెటిస్ వంటి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో సాధారణంగా సంభవించే అరుదైన, తీవ్రమైన ఇన్ఫెక్షన్. దీర్ఘకాలిక ఫంగల్ సైనసిటిస్ అనేది అలెర్జీలు, ఉబ్బసం లేదా దీర్ఘకాలిక సైనసైటిస్ చరిత్ర కలిగిన వ్యక్తుల్లో సాధారణంగా సంభవించే ఇన్ఫెక్షన్ సాధారణ రూపంగా చెప్పుకోవచ్చు. ఇన్వాసివ్ ఫంగల్ సైనసైటిస్ అనేది క్యాన్సర్, అవయవ మార్పిడి జరిగినవారు, రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు తీసుకునే వారు వంటి వ్యాధినిరోధకత బలహీనంగా ఉండేవారిలో సంభవించే అవకాశం ఉంటుంది.
ఫంగల్ సైనసైటిస్ లక్షణాలు..
ముక్కులో రద్దీగా ఉండటం, ముఖం భాగంలో నొప్పి, తలనొప్పి, జ్వరం, అలసట, పోస్ట్నాసల్ డ్రిప్‌లను కలిగి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఫంగల్ సైనసైటిస్ వాసన లేదా రుచిని కోల్పోయేలా చేస్తుంది. దృష్టి సమస్యలకు కూడా దారితీస్తుంది. ఫంగల్ సైనసైటిస్ ఉందని అనుమానించినట్లయితే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఫంగల్ సైనసైటిక్కు చికిత్స చేయకుండా వదిలేస్తే ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమవుతుంది.
నివారణ చర్యలు ఇవీ..
డ్రై సైనస్‌లు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతుంటాయి. ముక్కు లోపలి భాగం డ్రైగా ఉండటం వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అందుకని ముక్కు లోపలి భాగం తేమగా ఉండేలా చూసుకోవాలి. హ్యూమిడిఫైయర్ను వాడటం, ఎక్కువ మొత్తంలో నీరు తాగడం, సెలైన్ నాసల్ స్ప్రేను ఉపయోగించడం వల్ల ముక్కు లోపలి భాగం డ్రైగా లేకుండా చూసుకోవచ్చు.
పొగ, దుమ్ము, కాలుష్యం వంటివి సైనస్‌ను చికాకు పెడతాయి. ఫంగల్ సైనసైటిస్‌తో బాధపడుతున్నవారు బయటి వాతావరణంలోని కాలుష్యానికి గురికాకుండా చూసుకోవాలి.
ఇప్పటికే అలర్జీతో బాధపడేవారు ఫంగల్ సైనసైటిస్‌ను నివారించుకోవడానికి చికిత్స తీసుకోవడం ఒక్కటే పరిష్కారమార్గం అని గుర్తుంచుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడికి గురికాకుండా ఉండటం వంటివి రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో సాయపడతాయి. ఇది ఫంగల్ సైనసైటిస్‌ను నివారించడంలో సహకరిస్తుంది.
కొన్ని రకాల మందుల కారణంగా ఫంగల్ సైనసైటిస్ వస్తున్న విషయం గుర్తించగానే ఆ మందులను వాడకుండా ఉండాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాల విషయంలో వైద్యుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
క్రమం తప్పకుండా ఆవిరి పట్టడం అలవర్చుకోవాలి. జల్‌నేతి ప్రక్రియను కూడా అనుసరించి సమస్యను దూరం చేసుకోవచ్చు.
నాలుగు వారాల కంటే ఎక్కువ సమయం పాటు ఈ సమస్య వేధిస్తుంటే ఈఎన్టీ వైద్యుడ్ని సంప్రదించి తగు చికిత్స పొందాలి. అలాగే, ముక్కు నుంచి రక్తం కారినా, కన్నుల చుట్టూ నొప్పి కనిపించినా, కళ్లు ఉబ్బినట్లుగా కనిపించినా వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.