న్యూఢిల్లీ : మధుమేహం అనగానే చాలామంది. పండ్లకు దూరమవుతుంటారు. పండ్లలో ఉండే సహజమైన ఫ్రక్టోజ్‌తో వీటిని తినేందుకు భయపడుతుంటారు. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉండే పండ్లను మధుమేహులు తీసుకోవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణులు మామి అగర్వాల్ చెబుతున్నారు. జీఐ స్కోర్ తక్కువగా ఉండే పండ్లను మధుమేహులు నిరభ్యంతరంగా తీసుకుని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఇక జీఐ స్కోర్ తక్కువగా ఉండే పండ్ల విషయానికి వస్తే డయాబెటిస్ ఫ్రెండ్లీ ఆహారంలో ముందుగా పీచ్ పండ్లను చెప్పుకోవచ్చు.
ఈ పండులో జీఐ స్కోర్ దాదాపు 42 వరకూ ఉండటంతో దీనివల్ల మధుమేహుల్లో షుగర్, ఇన్సులిన్ లెవెల్స్‌కు ఎలాంటి హాని కలగదు. పొట్ట నిండిన భావన ఎక్కువ సేపు ఉండటంతో త్వరగా ఆకలి వేయదు. వీటిలో అదనంగా పొటాషియం, ఫైబర్, విటమిన్ ఏ, సీ వంటి ఆరోగ్యకర పోషకాలు మెండుగా ఉంటాయి. మధుమేహులు చెర్రీ పండ్లను కూడా ఎంచక్కా ఎలాంటి అనుమానాలు లేకుండా తినవచ్చు. వీటిలో ఉండే విటమిన్ సీ, ఫైబర్ శరీరంలో షుగర్ మెటబాలిజేషన్ను తగ్గిస్తాయి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా నిరోధిస్తాయి. వీటి జీఐ స్కోర్ కేవలం 20 కావడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో అనూహ్య పెరుగుదల ఉండదు. ఇక రేగి పండ్లు బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో ఉపకరిస్తాయి. వీటి జీఐ స్కోర్ 40 కాగా వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో పాటు 15 రకాల విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే నారింజ పండ్లు మధుమేహ రోగులకు అద్భుత ఫలమనే చెప్పాలి. వీటిలో విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఇది మధుమేహులకు సూపర్ ఫుడ్‌గా పేరొందింది.
జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంతో రక్తంలో చక్కెరను నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది. ఇక యాపిల్ పండ్లు లో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండటంతో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. యాపిల్ ఉండే ఫైబర్ శరీరం అధికంగా షుగర్‌ను గ్రహించడాన్ని అదుపు చేస్తుంది. యాపిల్‌లో అత్యవసర విటమిన్లు, మినరల్స్ ఉండటంతో ఇది మధుమేహులకు అద్భుతమైన పండుగా చెప్పుకోవచ్చు.