స్త్రీలకు పుట్టుకతోనే అండాలు వస్తాయని, తర్వాత ఆ సంఖ్య పెరిగే అవకాశం లేదని చదివాను. అయితే, ఒక మహిళ కడుపులో ఎన్ని అండాలున్నాయన్నది లెక్కించవచ్చా. ఆ సంఖ్యను బట్టి త్వరగా లేదా ఆలస్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉందా?
మీరన్నట్టు ఆడపిల్లలకు తల్లి కడుపులోనే అండాలు తయారవుతాయి. పుట్టుకతోనే, అండాశయంలో ఇరవై లక్షల దాకా ఉంటాయి. అయితే, ఇవి వాటంతట అవే చనిపోతూ ఉంటాయి కూడా. అలా రజస్వల సమయానికి 60 వేల దాకా మాత్రమే మిగులుతాయి. దాని తర్వాత, ఒకటీ రెండు సంవత్సరాలకు అండాల విడుదల మొదలవుతుంది. అలా విడుదల అవడానికి ప్రతినెలా సుమారు మూడు వందల అండాలు సిద్ధం అవుతాయి. వాటిలో నుంచి ఒక్కటే పరిపక్వం చెందుతుంది. మిగిలినవన్నీ చనిపోతాయి. ఇలా ఎప్పుడైతే మిగిలిన అండాల సంఖ్య వెయ్యికన్నా తక్కువ అవుతుందో.. ఆ దశను మెనోపాజ్ అంటారు. అయితే, ఎవరి కడుపులో ఎన్ని అండాలు ఉన్నాయి అనేది చెప్పలేం. సుమారుగా ఉండాల్సినన్ని ఉన్నాయో లేదో కొన్ని పరీక్షల ద్వారా చెప్పొచ్చు. అందులో ఒకటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్.ఎస్.హెచ్) పరీక్ష. దీని స్థాయి పదిలోపల ఉంటే అండాలు బాగానే ఉన్నట్టు.
నలభై దాటితే తక్కువగా ఉన్నట్టు. మరొకటి, యాంటీ మ్యులేరియన్ హార్మోన్ (ఎ.ఎం.హెచ్) పరీక్ష. దీని కౌంట్ 2.5 నుంచి 4.5 మధ్యలో ఉంటే ఎగ్స్ బాగానే ఉన్నట్టు. ఈ రెండూ రక్త పరీక్షలే. మూడో రకంలో, యోని గుండా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి అండాలు లెక్కపెడతారు. దీన్ని ఆంత్రల్ ఫాలికల్ కౌంట్ అంటారు. ఇది పదిలోపల ఉండాలి. నెలసరి వచ్చిన రెండోరోజు లేదా మూడో రోజు ఈ పరీక్షలన్నీ చేయాలి. సాధారణంగా 37 సంవత్సరాల లోపు వరకూ అండాల సంఖ్య బాగానే ఉంటుంది. తర్వాత బాగా తగ్గిపోతుంది. ఆ లోపు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే మంచిది.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్