Foods To Take During Fever | వాతావరణంలో మార్పుల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలల్లో వైరల్ జ్వరం కూడా ఒకటి. అలసట, తలనొప్పి, చలి, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వంటివి ఈ జ్వర లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ వైరల్ జ్వరానికి చికిత్స అవసరమైనప్పటికీ చికిత్సతోపాటు జ్వర లక్షణాలను తగ్గించే ఆహారాలను తీసుకోవడం కూడా చాలా అవసరం. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జ్వరం త్వరగా తగ్గడంతోపాటు శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చాలా మంది జ్వరం వచ్చినప్పుడు ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించడంతోపాటు జ్వరం నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. వైరల్ జ్వరం బారినపడినప్పుడు తీసుకోవాల్సిన ఆహారాల గురించి వైద్యులు తెలియజేస్తున్నారు.
వైరల్ జ్వరం బారిన పడినప్పుడు కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జ్వరం వల్ల వచ్చే చెమట కారణంగా కోల్పోయిన ఖనిజాలను తిరిగి శరీరానికి అందించడంలో కొబ్బరి నీళ్లు ఎంతో సహాయపడతాయి. ఈ నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. శరీర నొప్పులు కూడా తగ్గుతాయి. జ్వరం వచ్చినప్పుడు చికెన్ సూప్ ను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. చికెన్ సూప్ ను తీసుకోవడం వల్ల ప్రోటీన్ లభిస్తుంది. అంతేకాకుండా గొంతులో చిరాకు, గొంతు మంట వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అల్లం టీ లేదా అల్లం రసం వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా జ్వరం నుండి ఉపశమనం కలుగుతుంది. దీనిలో యాంటీ వైరల్ లక్షణాలతో పాటు శోథ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. అల్లాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వికారం తగ్గుతుంది. శరీర నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
తేలికగా జీర్ణమయ్యే ఆహారాల్లో అరటిపండు కూడా ఒకటి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు వచ్చే కండరాల తిమ్మిర్లను తగ్గించడంలో ఇది మనకు సహాయపడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ లను సమతుల్యంలో చేయడంలో కూడా అరటిపండు మనకు దోహదపడుతుంది. ఇక గోరు వెచ్చని పాలల్లో పసుపు కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జ్వరం త్వరగా తగ్గేలా చేయడంలో ఇది మనకు సహాయపడుతుంది. వైరల్ జ్వరంతో బాధపడే వారు గంజిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. గంజి త్వరగా జీర్ణమవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. నీరసం రాకుండా ఉంటుంది.
కూరగాయల రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. జ్వరం వచ్చినప్పుడు కూరగాయల రసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్పెక్షన్ తో పోరాడడానికి సహాయపడతాయి. యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉండే తేనెను తీసుకోవడం వల్ల కూడా మనం జ్వరం నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెరుగును తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఇన్పెక్షన్ లు త్వరగా తగ్గుతాయి. వైరల్ జ్వరాలతో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జ్వరం, దాని లక్షణాల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఆయా ఆహారాలను తీసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు.