Foods To Avoid At Night | మనం తీసుకునే ఆహారంపైనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆరోగ్యమే కాకుండా మన నిద్ర కూడా మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా. మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉన్నారు. ఇది మన నిద్రపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నిద్రలేమి సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాకుండా రాత్రి పూట సరిగ్గా నిద్రించకపోవడం వల్ల మరుసటి రోజు చిరుతిళ్లను తినాలనే కోరిక కలుగుతుంది. కనుక మనం నిద్రించే ముందు తీసుకోవాల్సిన ఆహారంపై తగిన శ్రద్ద చూపించడం చాలా అవసరం. మనం తీసుకునే భోజనమే మన నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. కనుక రాత్రి భోజన విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రాత్రి భోజనంలో కొన్ని ఆహారాలను నిషేధించాలి. రాత్రి భోజనంలో తీసుకోకూడని కొన్ని ఆహారాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
కారంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల నిద్రపోవడం కష్టమవుతుంది. కనుక వీటికి బదులు నిద్రించే ముందు హెర్బల్ టీ లేదా పెరుగన్నం వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది. కాఫీ, టీ లలో కెఫీన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల వీటిలో ఉండే కెఫీన్ శరీరంలో గంటల తరబడి ఉంటుంది. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. కనుక కెఫీన్ కు బదులుగా గోరు వెచ్చని పాలు, హెర్బల్ టీ లను తీసుకోవడం ఉత్తమం. మద్యం తీసుకోవడం వల్ల మొదట్లో నిద్రపోయినప్పటికీ ఇది నిద్ర చక్రానికి ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా నిద్రలేమితో పాటు నిద్ర నాణ్యత కూడా లోపిస్తుంది. కనుక నిద్రించే ముందు ఆల్కహాల్ ను తీసుకోకపోవడమే మంచిది. కొవ్వు ఉండే ఆహారాలు సులభంగా జీర్ణమవ్వవు. దీంతో కడుపులో అసౌకర్యం, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక నిద్రించే ముందు పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలను తీసుకోవాలి.
చక్కెర కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల శక్తి తగ్గిపోతుంది.నిద్రపోవడం కష్టంగా మారుతుంది. కనుక నిద్రించే ముందు చక్కెర కలిగిన ఆహారాలను తీసుకోకూడదు. నిద్రించే ముందు ఎక్కువగా భోజనం చేయడం వల్ల కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. దీని వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. కనుక పడుకోవడానికి కొన్ని గంటల ముందుగానే తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణమవ్వవు. నిద్రకు, జీర్ణక్రియకు అంతరాయాన్ని కలిగిస్తాయి. కనుక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం. కార్బోనేటెడ్ పానీయాలు కడుపు ఉబ్బరానికి , అజీర్ణానికి కారణమవుతాయి. దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. వీటికి బదులుగా నీటిని లేదా హెర్బల్ టీ లను తాగడం మంచిది.
అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కష్టంగా మారుతుంది. రాత్రి సమయంలో అసౌకర్యంగా ఉంటుంది. కనుక రాత్రి భోజనంలో లీన్ ప్రోటీన్ ను తక్కువగా తీసుకోవడం మంచిది. డార్క్ చాక్లెట్ లో ఉండే ఆమైనో ఆమ్లాలు, కెఫీన్ రాత్రంతా మనం మేల్కొని ఉండేలా చేస్తాయి. కనుక రాత్రి నిద్రించే ముందు డార్క్ చాక్లెట్ ను తీసుకోకూడదు. దీనిని పగటి పూట తీసుకోవడం మంచిది. ఈ ఆహారాలన్నీ కూడా నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తాయి. కనుక రాత్రి నిద్రించే ముందు తేలికగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోవాలి. అలాగే పడుకునే ముందు రెండు లేదా మూడు గంటల ముందుగానే ఆహారాన్ని తీసుకోవాలి.