Foods For Immunity | కరోనా భయం ఇంకా పూర్తిగా తొలగకముందే ప్రస్తుతం మరో కొత్త వైరస్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. చైనాలో కొత్తగా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) వ్యాప్తి చెందుతుండడంతో అక్కడ హాస్పిటల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇక భారత్ లోనూ హెచ్ఎంపీ వైరస్‌కు చెందిన కేసులు 5 నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఈ కొత్త వైరస్ కూడా కరోనా లాంటి లక్షణాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని వారు సూచిస్తున్నారు. అయితే ఇందుకు గాను మెడిసిన్లను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో సహజసిద్ధంగా లభించే పదార్థాలతోనే మన ఇమ్యూనిటీ పవర్‌ను రెండింతలు పెంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీర రోగ నిరోధక శక్తి పెరగాలంటే సీజనల్ పండ్లతోపాటు ఇతర పండ్లను కూడా మనం తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిమ్మజాతికి చెందిన సిట్రస్ పండ్లను తినాలి. నారింజ పండ్లు ఇదే కోవకు చెందుతాయి. అలాగే నిమ్మ, ద్రాక్ష, కివి, బెర్రీ పండ్లు, క్యాప్సికం వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షిస్తాయి. దీంతో హెచ్ఎంపీ వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు.
గ్రీన్ టీని రోజూ రెండు కప్పులు సేవిస్తున్నా కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. గ్రీన్ టీలో కాటెకిన్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కనుక హెచ్ఎంపీ వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే రోజూ గ్రీన్ టీని సేవించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తింటున్నా కూడా ఈ వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. మనకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా చియా విత్తనాలు, అవిసె గింజలు, వాల్ నట్స్ లో లభిస్తాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. దీంతో శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
అల్లం రసాన్ని సేవిస్తున్నా కూడా రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుకోవచ్చు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియ్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అల్లంను ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హెచ్ఎంపీ వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. అదేవిధంగా రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 వెల్లుల్లి రెబ్బలను తింటున్నా కూడా ఇమ్యూనిటీ పవర్‌ను అమాంతం పెంచుకోవచ్చు. వెల్లుల్లిలోనూ యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. కనుక హెచ్ఎంపీ వైరస్ నుంచి రక్షణ లభించాలంటే రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకుని హెచ్ఎంపీ వైరస్ నుంచి సురక్షితంగా ఉండవచ్చు.