Foods For Bones And Muscles Health | మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు గాను కండరాలు, ఎముకలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి దృఢంగా ఉంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే మనం రోజంతా చురుగ్గా పనిచేస్తాం. యాక్టివ్‌గా ఉంటాం. మన సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక కండరాలు, ఎముకలను దృఢంగా ఉంచుకోవడం తప్పనిసరి. అయితే ఇవి దృఢంగా ఉండేందుకు గాను కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు. మన ఆహారంలో పలు ఫుడ్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల కండరాలు, ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఆ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాహారం తినడం వల్ల కండరాల్లో బలం పెరుగుతుంది. వీటితోపాటు ప్రతి రోజూ ఒక కోడిగుడ్డును తిన్నా కండరాలు నిర్మాణమవుతాయి. అలాగే పాల ఉత్పత్తులు ఏవి తీసుకున్నా కూడా కండరాల బలం పెరుగుతుంది.
బీన్స్‌ను తినడం అలవాటు చేసుకుంటే కండరాలు, ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవచ్చు. సాల్మన్ లాంటి చేపలను తింటే కండరాల పుష్టి పెరుగుతుంది. ఎముకలు గట్టి పడాలంటే క్యాల్షియంతోపాటు విటమిన్ డి ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంఆ పాలను తప్పనిసరిగా తీసుకోవాలి. పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే పెరుగులోనూ క్యాల్షియం ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల రోజూ పాలు లేదా పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు బలం కోసం ఈ రెండింటినీ రోజూ ఇవ్వాలి.
కొత్తిమీర, నారింజ రసంలో కూడా క్యాల్షియం అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా చేపలను తింటే క్యాల్షియంతోపాటు విటమిన్ డి కూడా పొందవచ్చు. దీని వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. బ్రొకలి, గింజలు, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాలను తీసుకున్నా క్యాల్షియం, విటమిన్ డి లభిస్తాయి. ఇవి ఎముకలకు ఎంతో బలాన్నిస్తాయి. విటమిన్ సి, ఫాస్ఫరస్ ఉండే అరటి పండ్లను తింటే తక్షణమే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా అరటి పండ్లు ఎముకల గట్టితనానికి ఉపయోగపడతాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ బి6 ఎముకల దృఢత్వానికి ఉపయోగపడే పలు ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. కనుక అరటి పండ్లను తరచూ తింటున్నా కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.
కండరాలు, ఎముకలు దృఢంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. కండరాలు, ఎముకల దృఢత్వానికి ఆహారం తీసుకునే వారు కచ్చితంగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. లేదంటే బరువు పెరుగుతారు. కనుక వ్యాయామం తప్పనిసరి. అలాగే రోజుకు తగినన్ని గంటలపాటు నిద్రించాల్సి ఉంటుంది. నిద్ర తక్కువ అయినా కూడా బరువు పెరిగిపోతారు. కాబట్టి రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
ఇక క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో చీజ్ కూడా ఒకటి. అయితే దీన్ని తింటే కచ్చితంగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. లేదంటే బరువు పెరుగుతారు. అలాగే క్యాల్షియం కోసం నువ్వులు, అవిసె గింజలను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల పనితీరుకు ఎంతో దోహధపడతాయి. వీటితోపాటు పుట్టగొడుగులను కూడా ఆహారంలో భాగం చేసుకుంటే క్యాల్షియం, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాలను నిర్మించడంతోపాటు ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల కండరాలను, ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.