Belly Fat | అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బరువు సులభంగా పెరుగుతారు. కానీ దాన్ని తగ్గించుకోవడమే చాలా కష్టం. అయితే బరువు ఎంత కంట్రోల్లో ఉన్నా కొందరికి పొట్ట దగ్గర కొవ్వు మాత్రం అధికంగానే ఉంటుంది. దీన్ని తగ్గించుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకునేందుకు చాలా ట్రై చేశాం. కానీ ఏవీ పనిచేయడం లేదు.. అని వాపోయేవారు ఫిట్నెస్ నిపుణులు చెబుతున్న కొన్ని సూచనలు పాటించాలి. దీంతో ఫలితం త్వరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సూచనలను కచ్చితంగా 3 నెలల పాటు పాటిస్తే మీ పొట్ట కరిగిపోయి ఫ్లాట్ మారుతుందని వారు అంటున్నారు. ఇక ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్ట దగ్గరి కొవ్వు కరగాలని భావించే వారు ముందుగా చేయాల్సిన పని.. జంక్ ఫుడ్‌ను అసలు తినకూడదు. జంక్ ఫుడ్ వల్లే పొట్ట దగ్గర కొవ్వు చేరుతుంది. ముఖ్యంగా నూనెలో వేయించిన పదార్థాలు, చిరు తిళ్లు, స్వీట్లు, చక్కెర ఉండే పదార్థాలు తినకూడదు. అలాగే మద్యం సేవించకూడదు. మద్యాన్ని సేవించినా కూడా పొట్ట దగ్గర కొవ్వు చేరుతుందన్న విషయాన్ని గ్రహించాలి. అలాగే ధూమపానం కూడా చేయరాదు. ఇది కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. పొట్ట దగ్గర కొవ్వును కరిగించేందుకు గాను రోజూ మీకు కావల్సిన మొత్తంలో మాత్రమే ఆహారాన్ని తినాలి. మరీ అధికంగా ఆహారం తినకూడదు. అలాగని పూర్తిగా ఆహారాన్ని తగ్గించడం కూడా మంచిది కాదు. కనీసం 1500 క్యాలరీలు లభించేలా ఆహారం తీసుకోవాలి. దీంతో కొవ్వు కరిగే ప్రక్రియ మొదలవుతుంది.
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. చికెన్, కోడిగుడ్లు, ప్రాన్స్, చేపలు, పనీర్, ఇతర పాల ఉత్పత్తులలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో తరచూ తీసుకోవాలి. అలాగే ఫైబర్ అధికంగా ఉండే పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలను తినాలి. నట్స్, విత్తనాలు, నెయ్యి, వెజిటబుల్ ఆయిల్స్‌ను కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు, పొట్ట దగ్గరి కొవ్వు కరిగేందుకు సహాయం చేస్తాయి. అలాగే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలు, పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
పొట్ట దగ్గరి కొవ్వును కరిగించేందుకు గాను మీరు 6:1 రూల్‌ను పాటించాలి. ఇందులో బాగంగా వారంలో 6 రోజుల పాటు వ్యాయామం చేస్తూ డైట్ పాటించాలి. ఇతర జంక్ ఫుడ్, అన్ని రకాల అనారోగ్య కరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఒక్క రోజు మాత్రం మీరు మీకు ఇష్టమైన ఆహారం తినవచ్చు. ఆ రోజు వ్యాయామం కూడా చేయాల్సిన పనిలేదు. కానీ వారంలో 6 రోజులు మాత్రం కచ్చితంగా డైట్‌ను పాటించాలి. దీన్ని చాలా మంది సెలబ్రిటీలు పాటిస్తుంటారు. దీని వల్ల తమకు ఇష్టమైన ఫుడ్‌కు దూరం అవుతున్నామన్న బెంగ ఉండదు. పైగా లాభాలు కూడా పొందవచ్చు. అలాగే పొట్ట దగ్గరి కొవ్వును కరిగించేందుకు నిద్ర కూడా అవసరమే. రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇది కూడా మీ శరీర శక్తి స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చువుతాయి. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. ఇలా పలు సూచనలు పాటిస్తే పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడం పెద్ద కష్టమేమీ కాదని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.