Over Sweating | వేసవి కాలంలోనే కాకుండా చాలా మందికి అన్ని సీజన్లలోనూ చెమట ఎక్కువగా వస్తుంటుంది. చిన్న పనిచేసినా లేదా ఫ్యాన్ కాసేపు తిరగకపోయినా, ఎండలో తిరిగినా విపరీతంగా చెమట వస్తుంది. దీంతో తీవ్ర అవస్థ పడుతుంటారు. అయితే కొన్ని రకాల కారణాల వల్ల కొందరికి విపరీతమైన చెమట వస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారిలో, షుగర్, బీపీ మందులను వాడే వారిలో చెమట రావడం సహజమే. ఇవి కాకుండా ఇతర కారణాలు ఏమీ లేకున్నా చెమట వస్తుంటే మాత్రం దాన్ని సులభంగానే తగ్గించుకోవచ్చు. అందుకు పలు ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. వాటిని వాడడం ద్వారా అధికంగా ఉత్పత్తి అయ్యే చెమటను తగ్గించుకోవచ్చు. అలాగే శరీరం దుర్వాసన రాకుండా కూడా ఉంటుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
యాపిల్ సైడర్ వెనిగర్ యాస్ట్రింజెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అంటే ఇది చెమట ఉత్పత్తిని తగ్గిస్తుందన్నమాట. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి చెమట దుర్వాసనను కూడా తగ్గిస్తాయి. ఇందుకు గాను యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుని నీటిలో కలపాలి. ఒక భాగం యాపిల్ సైడర్ వెనిగర్‌కు 2 భాగాల నీళ్లను కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మీకు చెమట అధికంగా వచ్చే భాగాల్లో రాయాలి. చంకలు, చేతులు, కాళ్లపై కాటన్ బాల్ సహాయంతో రాయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయం స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే అతిగా చెమట ఉత్పత్తి కాదు. చెమట దుర్వాసన కూడా రాకుండా ఆపవచ్చు. అయితే కొందరికి యాపిల్ సైడర్ వెనిగర్ పడదు. అలాంటి వారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే దీన్ని ఉపయోగించాలి.
బేకింగ్ సోడా మిశ్రమం కూడా అతి చెమట ఉత్పత్తిని తగ్గిస్తుంది. బేకింగ్ సోడా ఆల్కలైన్ గుణాన్ని కలిగి ఉంటుంది. కనుక అతిగా ఉత్పత్తి అయ్యే చెమటను శోషించుకుంటుంది. అలాగే చెమట దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను సైతం నిర్మూలిస్తుంది. ఇందుకు గాను బేకింగ్ సోడాను కొద్దిగా తీసుకుని అందులో కాస్త నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని చెమట వచ్చే భాగాల్లో రాయాలి. 15 నుంచి 30 నిమిషాల పాటు వేచి ఉన్నాక స్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా అధిక చెమట ఉత్పత్తి తగ్గుతుంది. చెమట వాసన రాకుండా అరికట్టవచ్చు. కార్న్ స్టార్చ్‌ను కూడా ఇలాగే అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కార్న్ స్టార్చ్‌ను నీటితో కలిపి పేస్ట్‌లా చేసి రాస్తున్నా కూడా చెమట ఉత్పత్తి తగ్గుతుంది. చెమట వాసన రాకుండా ఉంటుంది.
బ్లాక్ టీ మిశ్రమం కూడా చెమట అధిక ఉత్పత్తిని అరికడుతుంది. బ్లాక్ టీలో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సహజసిద్ధమైన యాస్ట్రింజెంట్‌గా పనిచేస్తుంది. చెమట అధికంగా ఉత్పత్తి అవడాన్ని తగ్గిస్తుంది. దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాకు చెక్ పెడుతుంది. కొద్దిగా బ్లాక్ టీని తీసుకుని చల్లార్చి కాటన్ బాల్ సహాయంతో చెమట వచ్చే భాగాలపై రాయాలి. 20 నిమిషాలు అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా అధికంగా ఉత్పత్తి అయ్యే చెమటను తగ్గించవచ్చు. శరీరం దుర్వాసన రాకుండా ఆపవచ్చు. ఆలుగడ్డ కూడా ఈ సమస్య నుంచి మనల్ని బయట పడేస్తుంది. ఆలుగడ్డలోనూ యాస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. ఆలు గడ్డలను గుండ్రని ముక్కలుగా కట్ చేసి చెమట వచ్చే భాగాలపై మర్దనా చేస్తుండాలి. తరువాత ఆరబెట్టి స్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా అధిక చెమట ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ చిట్కాలను పాటిస్తే చెమట అధికంగా పట్టదు. అలాగే శరీరం దుర్వాసన రాకుండా ఉంటుంది.