Mouth Ulcers | చాలా మందికి నోట్లో అప్పుడప్పుడు చిన్నపాటి పుండ్లు ఏర్పడుతుంటాయి. వీటినే వేడి గుల్లలు లేదా పొక్కులు, మౌత్ అల్సర్ అని కూడా పిలుస్తారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నా, వేడిని కలిగించే ఆహారాలను అధికంగా తిన్నా, కారం, మసాలాలను తీసుకున్నా, పలు రకాల మెడిసిన్ల వల్ల కూడా ఇలా జరుగుతుంది. సాధారణంగా నోట్లో పుండ్లు వాటంతట అవే తగ్గిపోతాయి. అందుకు వారం నుంచి రెండు వారాల వరకు సమయం పడుతుంది. అయితే నొప్పి, వాపు, మంట నుంచి ఉపశమనం పొందాలంటే పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీంతో పుండ్లు కూడా త్వరగా మానిపోతాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటంటే..
ఉప్పు నీళ్లలో సహజసిద్ధమైన యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల నోట్లో ఉప్పు నీళ్లను పోసి పుక్కిలిస్తుంటే వాపులు, పుండ్లు తగ్గిపోతాయి. నోట్లో పుండ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. అర టీస్పూన్ లేదా ఒక టీస్పూన్ ఉప్పును ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని 30 నుంచి 60 సెకన్ల పాటు బాగా పుక్కిలించాలి. తరువాత ఉమ్మేయాలి. ఇలా గ్లాసులో ఉన్న నీళ్లు అన్నీ అయిపోయే వరకు 2-3 సార్లు పుక్కిలిస్తుండాలి. దీంతో నోట్లోని పుండ్లు త్వరగా మానిపోతాయి. తేనెలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి పుండ్లను తగ్గించడంలో సహాయం చేస్తాయి. కొద్దిగా తేనెను తీసుకుని నేరుగా పుండ్లపై రాయాలి. రోజులో వీలున్నన్ని సార్లు ఇలా చేస్తుంటే ఫలితం ఉంటుంది.
కొబ్బరినూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఒక కాటన్ బాల్ లేదా వేలి సహాయంలో నోట్లో పుండు ఉన్న చోట కాస్త కొబ్బరినూనెను రాయాలి. లేదా వీలుంటే ఆయిల్ పుల్లింగ్ కూడా చేయవచ్చు. రాత్రి పూట ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. పుండ్లు త్వరగా మానిపోతాయి. పసుపులో కర్క్యుమిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్ సమ్మేళనంగా పనిచేస్తుంది. పుండ్లు త్వరగా మానిపోయేలా చేస్తుంది. కొద్దిగా పసుపును తీసుకుని అందులో కొన్ని చుక్కల నీళ్లను వేసి కలిపి మెత్తని పేస్టులా మార్చాలి. దీన్ని నోట్లో పుండ్లు ఉన్న చోట రాయాలి. 20 నిమిషాలు అయ్యాక పుక్కిలించేయాలి. రోజుకు 3 సార్లు ఇలా చేస్తుంటే నోట్లోని పుండ్లు మానిపోతాయి.
కలబంద గుజ్జును రాయడం వల్ల కూడా నోట్లోని పుండ్లను తగ్గించుకోవచ్చు. కలబందలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గాయాలు, పుండ్లను త్వరగా తగ్గిస్తాయి. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని నేరుగా పుండ్లపై రాయాలి. కాసేపు అయ్యాక ఉమ్మేయాలి. ఇలా రోజులో మీకు వీలైనన్ని సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. పుండ్లు త్వరగా మానిపోతాయి. బేకింగ్ సోడా, నీరు మిశ్రమం నోట్లో ఉండే ఆమ్లాలను తొలగిస్తుంది. దీంతో నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కాస్త నీరు కలిపి పేస్టులా చేయాలి. దీన్ని రాస్తుంటే నోట్లోని పుండ్లు తగ్గిపోతాయి. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తూ నోట్లోని పుండ్లను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.