Gout | శరీరంలో దీర్ఘకాలం పాటు యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటే కీళ్లలో చిన్నపాటి స్ఫటికాలు ఏర్పడి తీవ్రమైన నొప్పులు, వాపులకు దారి తీస్తుంది. దీన్నే గౌట్ లేదా ప్రొయాక్టివ్ ఆర్థరైటిస్ అని పిలుస్తారు. మన శరీరంలో ఎప్పటికప్పుడు తయారయ్యే యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. కానీ కొందరిలో యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో గౌట్ సమస్య వస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు మోతాదుకు మించి ఎక్కువగా ఉంటే హైపర్ యురిసిమియా అంటారు. యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే అందరికీ గౌట్ రాదు. కానీ దీర్ఘకాలంలో మాత్రం కచ్చితంగా గౌట్ వచ్చే అవకాశాలు 100 శాతం వరకు ఉంటాయి. అయితే గౌట్ వచ్చిన వారు డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. అలాగే పలు చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
గౌట్ సమస్య ఉన్నవారికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. రోజూ మెంతులను తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. మెంతులను తింటుంటే శరీరం లోపల, బయట ఉండే వాపులు తగ్గిపోతాయి. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను తిని అనంతరం ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల గౌట్ సమస్య తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గౌట్ సమస్య తగ్గేందుకు గాను వెల్లుల్లి కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ స్థాయిలను వెల్లుల్లి తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు ఘాటుగా ఉంటాయి కనుక తేనెతోనూ కలిపి తినవచ్చు. ఇలా రోజూ చేస్తుంటే గౌట్ సమస్య తగ్గిపోతుంది.
వాము, అల్లాన్ని మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తాం. గౌట్ సమస్యకు ఇవి కూడా చక్కగా పనిచేస్తాయి. ఇవి చెమటను అధికంగా ఉత్పత్తి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. శరీరంలో అధికంగా ఉండే యూరిక్ యాసిడ్ బయటకు వెళ్లేలా చేస్తాయి. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ వాము, చిన్న అల్లం ముక్కను వేసి మరిగించాలి. అనంతరం వచ్చే నీళ్లను వడకట్టి అందులో సగం నీళ్లను ఉదయం, మిగిలిన సగం నీళ్లను సాయంత్రం సేవించాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. అలాగే గౌట్ సమస్యను తగ్గించడంలో ఆముదం కూడా బాగానే పనిచేస్తుంది. కొద్దిగా ఆముదాన్ని తీసుకుని వేడి చేసి దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో మర్దనా చేస్తూ రాయాలి. దీని వల్ల వాపులు, నొప్పులు, ఎరుపుదనం తగ్గిపోతాయి. రోజూ ఇలా చేస్తుంటే గౌట్ నుంచి బయట పడవచ్చు.
మనం కొత్తిమీరను తరచూ వంటల్లో వేస్తుంటాం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. అందువల్ల కొత్తిమీర ఆకులను వేసి మరిగించిన నీళ్లను రోజూ తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. లేదా కొత్తిమీర ఆకుల రసాన్ని కూడా తాగవచ్చు. అలాగే పసుపు కూడా మేలు చేస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. పసుపు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కనుక వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. గౌట్ సమస్య తగ్గేందుకు సహాయం చేస్తుంది. రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే రోజూ గుప్పెడు చెర్రీ పండ్లను తింటున్నా కూడా ఈ సమస్య తగ్గిపోతుంది. చెక్రీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో గౌట్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఆయా చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.