Acne | అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నలుగురిలోకి వెళ్లినప్పుడు ముఖం అందంగా కనిపించాలని కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా ఆరాట పడుతున్నారు. అందులో భాగంగానే ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం అనేక పద్ధతులను పాటిస్తున్నారు. ముఖ్యంగా బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఖరీదైన చికిత్సలను తీసుకుంటున్నారు. అయితే ఇవి తాత్కాలికంగా ముఖ సౌందర్యాన్ని పెంచినా దీర్ఘకాలంలో ఈ రసాయనాల వల్ల ముఖం అందం మారిపోతుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనుక ముఖ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే అందుకు నాచురల్ టిప్స్‌ను పాటించాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా మన ఇంట్లో లభించే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించడం వల్ల సహజసిద్ధంగానే మన ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి సీరంను ఉపయోగించడం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మొటిమలు తగ్గిపోతాయి. దీన్ని ఎలా తయారు చేయాలంటే.. కొద్దిగా నిమ్మరసం, కలబంద గుజ్జు, రోజ్ వాటర్ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. దీన్ని రోజుకు ఒకసారి ఉపయోగించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసిన తరువాత 15 నిమిషాలు ఆగి కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఇది ఉపయోగపడుతుంది. అలాగే కలబంద గుజ్జును నేరుగా ముఖంపై కూడా అప్లై చేయవచ్చు. అయితే ఇది నాచురల్ది అయి ఉండాలి. చాలా మంది ఇండ్లలో కలబంద మొక్కలను పెంచుతుంటారు. కలబంద ఆకుల నుంచి అప్పటికప్పుడు తీసిన గుజ్జును వాడాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మంపై ఉండే వాపులు తగ్గుతాయి. ఎరుపుదనం పోతుంది. చర్మానికి తేమ లభించి మృదువుగా మారుతుంది.
మొటిమలు, మచ్చలను తగ్గించడంలో తేనె, దాల్చిన చెక్క మిశ్రమం కూడా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల తేనె, 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. 15 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఈ చిట్కాను రోజూ పాటిస్తే ముఖంలో కాంతి పెరుగుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోయి ముఖ సౌందర్యం పెరుగుతుంది. ముఖ సౌందర్యాన్ని పెంచడంలో టీ ట్రీ ఆయిల్ కూడా పనిచేస్తుంది. కొద్దిగా కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని అందులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గి ముఖంలో కాంతి పెరుగుతుంది. ముఖానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఒక కాటన్ బాల్‌ను ముంచి దాంతో ముఖంపై సున్నితంగా మర్దనా చేయాలి. 10 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే మృత కణాలు పోతాయి. ముఖంలో కాంతి పెరుగుతుంది. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కనుక సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా దీన్ని ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఎలాంటి దురదలు రావట్లేదు అనుకుంటేనే దీన్ని ఉపయోగించాలి. అలాగే గ్రీన్ టీతో కూడా అందాన్ని పెంచుకోవచ్చు. గ్రీన్ టీని తయారు చేసి చల్లార్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా ముఖంలో కాంతి పెరుగుతుంది. అందంగా తయారవుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. అలాగే పెరుగులో కాస్త పసుపు కలిపి ముఖానికి రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా ముఖంలో కాంతి పెరిగి అందంగా మారుతుంది. ఇలా ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ సౌందర్యాన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు.