Black Hair | ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే జుట్టు తెల్లగా అయ్యేది. కానీ ప్రస్తుతం చిన్న వయస్సులో ఉన్నవారు కూడా జుట్టు తెల్లబడే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పోషకాహార లోపం, ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం, ఆందోళన, కాలుష్యం, తగినన్ని నీళ్లను తాగకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల జుట్టు తెల్లబడే సమస్యను చిన్న వయస్సులోనే ఎదుర్కొంటున్నారు. అయితే ఇందుకు ఖరీదైన చికిత్సలు చేయించాల్సిన పనిలేదు. పలు చిట్కాలను పాటిస్తే చాలు.. తెల్లబడ్డ జుట్టును సహజసిద్ధంగా నల్లగా మార్చుకోవచ్చు. దీంతోపాటు శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు నుంచి సైతం విముక్తి లభిస్తుంది.
కొన్ని ఎండిన ఉసిరి ముక్కలను తీసుకుని ఒక కడాయిలో వేయాలి. అందులోనే కాస్త కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెను ముక్కలు మునిగే వరకు పోయాలి. తరువాత వాటిని బాగా మరిగించాలి. దీంతో కాసేపటికి నూనె నల్లగా మారుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నూనెను వడబోసి సీసాలో నిల్వ చేయాలి. దీన్ని జుట్టుకు రాసి 2 గంటలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరగడమే కాదు, తెల్లగా ఉన్న జుట్టు సహజసిద్ధంగా నల్లగా మారుతుంది. అలాగే ఉసిరిక పొడిలో హెన్నా పొడి, పెరుగు కలిపి మిశ్రమంగా చేసి దీన్ని జుట్టుకు రాసి కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా సమస్య తగ్గుతుంది.
బ్లాక్ టీని తయారు చేసి దాన్ని జుట్టుకు బాగా మర్దనా చేయాలి. గంట సేపు అయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తున్నా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే బ్లాక్ కాఫీ కూడా బాగానే పనిచేస్తుంది. దీన్ని కూడా జుట్టుకు పట్టించి 20 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో కూడా శిరోజాలు సహజసిద్ధంగా నల్లగా మారుతాయి. ఒక కడాయిలో కొబ్బరినూనెను వేసి అందులో కొన్ని కరివేపాకులను మునిగేలా వేసి మరిగించాలి. ఆకులు నల్లబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చాలి. అనంతరం దీన్ని వడకట్టి ఒక సీసాలో నిల్వ చేయాలి. దీన్ని జుట్టుకు రాత్రి పూట మసాజ్ చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే తప్పక ఫలితం కనిపిస్తుంది.
ఉల్లిపాయల నుంచి జ్యూస్‌ను తీయాలి. దీన్ని జుట్టుకు నేరుగా మర్దనా చేయాలి. 60 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. అవసరం అయితే కాస్త పెరుగు లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తరచూ రాస్తుంటే చుండ్రు తగ్గుతుంది. శిరోజాలు నల్లగా మారుతాయి. బీరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. అనంతరం వాటిని కొబ్బరినూనెలో వేసి నల్లగా అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఆ నూనెను సేకరించి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను తరచూ రాస్తుంటే తెల్లబడ్డ జుట్టు మళ్లీ నల్లగా మారుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి. కాంతివంతంగా తయారవుతాయి. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల శిరోజాలను నల్లగా మార్చుకోవడమే కాక జుట్టును ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేయవచ్చు.