Neck Darkness | కొందరికి శరీరంపై ఇతర భాగాల్లోని చర్మం అంతా సాధారణ రంగులోనే ఉంటుంది. కానీ మెడపై ఉండే చర్మం మాత్రం నలుపుగా మారుతుంది. ఇలా మెడ నల్లగా మారేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్, అధిక బరువు ఉండడం, హార్మోన్ సమస్యలు, పలు రకాల మందులను వాడడం వల్ల కొందరికి మెడ దగ్గర చర్మం నల్లగా మారుతుంది. అయితే ఇందుకు ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే సహజసిద్ధంగానే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మెడపై ఉండే నలుపును పోగొట్టడానికి మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలే ఉపయోగపడతాయి.
బేకింగ్ సోడాతో ఓ మిశ్రమాన్ని తయారు చేసి రాయడం వల్ల మెడపై ఉండే నలుపుదనం పోతుంది. బేకింగ్ సోడా సహజసిద్ధమైన ఎక్స్‌ఫోలియెంట్‌గా పనిచేస్తుంది. శరీరంపై పేరుకుపోయిన మృత చర్మ కణాలను తొలగిస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. దీంతో మెడపై ఉండే నలుపుదనం పోతుంది. ఇందుకు గాను 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను తీసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని మెడపై నల్లగా ఉండే భాగంపై రాయాలి. తరువాత వృత్తాకారంలో మర్దనా చేయాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తరువాత నీటిలో కడిగేయాలి. ఈ చిట్కాలను వారంలో 2 సార్లు పాటిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడా అందరి చర్మానికి పడకపోవచ్చు. కనుక ముందుగా దీన్ని ప్యాచ్ టెస్ట్ చేసిన తరువాతే ఉపయోగించాలి.
మెడపై ఉండే నల్లదనాన్ని పోగొట్టేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పనిచేస్తుంది. ఇది కూడా మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని దానికి అంతే మోతాదులో నీళ్లను కలపాలి. ఆ మిశ్రమంలో ఒక కాటన్ బాల్‌ను ముంచాలి. దాన్ని మెడపై నలుపుదనం ఉన్న చోట రాయాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. రోజుకు ఒకసారి ఇలా చేస్తుంటే మెడభాగం మొత్తం నలుపుదనం పోయి తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. ఇక యాపిల్ సైడర్ వెనిగర్ యాసిడ్ స్వభావం ఉంటుంది కనుక అన్ని చర్మాలపై ఒకేరకంగా ప్రభావం చూపించదు. కనుక ముందుగా దీన్ని కూడా ప్యాచ్ టెస్ట్ చేసి వాడుకోవడం మంచిది.
మెడ భాగంపై ఉండే నలుపుదనాన్ని పోగొట్టేందుకు నిమ్మరసం, తేనె ఎంతగానో పనిచేస్తాయి. ఈ మిశ్రమం సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. చర్మం తేమగా ఉండేలా చేస్తాయి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకుని కలిపి మెడపై నల్లగా ఉన్న చోట సున్నితంగా మర్దనా చేస్తూ రాయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేయాలి. తరువాత నీటితో కడిగేయాలి. ఈ చిట్కాను రోజూ పాటించాల్సి ఉంటుంది. దీంతో మెడపై ఉండే నలుపుదనం పోతుంది. అలాగే ఆలుగడ్డల జ్యూస్ కూడా పనిచేస్తుంది. ఆలుగడ్డ నుంచి జ్యూస్ తీసి దాన్ని కాటన్ బాల్ సహాయంతో మెడపై రాయాలి. కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా మెడపై ఉండే నలుపుదనం పోతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు.