Backpain | ప్రస్తుతం చాలా మంది రోజూ గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి తోడు అధిక ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, వ్యాయామం చేయకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం వంటివి సమస్యాత్మకంగా మారుతున్నాయి. వీటి వల్ల వెన్ను నొప్పి వస్తోంది. అయితే ఈ నొప్పిని తగ్గించుకునేందుకు చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ దీర్ఘకాలంలో వీటిని వాడడం అంత మంచిది కాదు. అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వెన్ను నొప్పి తగ్గాలంటే అందుకు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. వాటితోపాటు పలు రకాల ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
వెన్ను నొప్పిని తగ్గించేందుకు పలు ఆయుర్వేద చిట్కాలు ఎంతగానో పనిచేస్తాయి. కొబ్బరినూనెను కొద్దిగా తీసుకుని అందులో కర్పూరం వేసి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి. దాన్ని సీసాలో నిల్వ చేసుకుని రోజూ వెన్నుపై మర్దనా చేయాలి. దీంతో కొద్ది రోజుల్లోనే వెన్ను నొప్పి తగ్గుతుంది. స్నానం చేసేందుకు వాడే గోరు వెచ్చని నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలపాలి. అనంతరం ఆ నీటితో స్నానం చేయాలి. దీంతో కేవలం వెన్ను నొప్పి మాత్రమే కాదు, శరీరంలో ఉండే ఇతర నొప్పులు కూడా తగ్గుతాయి. సముద్రపు ఉప్పును వేడి చేసి దాన్ని ఒక వస్త్రంలో చుట్టి దాంతో కాపడం పెడితే ఎంతటి నొప్పి అయినా ఇట్టే తగ్గిపోతుంది. ఆవనూనెను కొద్దిగా వేడి చేసి దాంతో వెన్నుపై బాగా మర్దనా చేయాలి. అనంతరం వేడినీటితో స్నానం చేయాలి. దీంతో వెన్ను నొప్పి తగ్గుతుంది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు, కొంత తేనెలను బాగా కలిపి రాత్రి నిద్రించడానికి ముందు తాగితే ఎలాంటి నొప్పి అయినా తగ్గుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. అల్లంతో టీ చేసుకుని తాగితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. హెర్బల్ ఆయిల్‌తో వెన్నుపై బాగా మర్దనా చేసి అనంతరం వేడి నీటితో స్నానం చేయాలి. దీంతో నొప్పి తగ్గుతుంది. బియ్యాన్ని కొద్దిగా వేడి చేసి వస్త్రంలో చుట్టి దాంతో కాపడం పెట్టుకున్నా వెన్ను నొప్పి తగ్గుతుంది. ఇక వెన్ను నొప్పి ఉన్నవారు గంటల తరబడి ఒకే చోట కూర్చోకూడదు. కనీసం గంటకు 5 నిమిషాల పాటు అయినా సరే శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అలాగే కూర్చునే చోట శరీర భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కొన్ని సార్లు డెస్క్ లేదా కుర్చీ సరైన ఎత్తులో లేకపోయినా కూడా వెన్ను నొప్పి వస్తుంది. ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి.
రాత్రి పూట నిద్రించేటప్పుడు కూడా వెన్నుపై భారం పడకుండా చూసుకోవాలి. అలాగే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. మరీ అధికంగా బరువు ఉండకూడదు. మరీ తక్కువగా కూడా ఉండకూడదు. కొందరికి పాదరక్షలు లేదా షూస్ సరిగ్గా లేకపోయినా కూడా వెన్ను నొప్పి వస్తుంది. మీ పాదరక్షలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలి. అలాగే వెన్ను నొప్పి తగ్గేందుకు సరైన డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వెన్ను నొప్పి తగ్గేందుకు సహాయం చేస్తాయి. అలాగే బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, చెర్రీలు, పాలకూర, క్యారెట్లు, చిలగడదుంపలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, వాల్ నట్స్, బాదంపప్పు, చియా విత్తనాలు, బ్రౌన్ రైస్, ఓట్స్, కినోవా, పెరుగు, చీజ్, కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్, అవకాడోలు వంటి ఆహారాలను తీసుకుంటున్నా కూడా మేలు జరుగుతుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తింటుంటే వెన్ను నొప్పి నుంచి సులభంగా బయట పడవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.