Indigestion Home Remedies | ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ వంటలను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. చాలా మందికి ఆ రోజు సెలవు ఉంటుంది కనుక తమకు ఇష్టమైన వంటకాలను ఇంట్లో తయారు చేసుకుని తింటారు. కొందరు బయటి ఫుడ్ తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే మాంసాహారాన్ని అతిగా తింటారు. దీంతో అది ఒక్కోసారి జీర్ణం కాక అవస్థలు పడుతుంటారు. కొందరు శాకాహార పదార్థాలను తిన్నప్పటికీ ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదని చెబుతుంటారు. ఇలాంటి వారందరూ కింద ఇచ్చిన కొన్ని చిట్కాలను పాటిస్తే దాంతో జీర్ణ శక్తి పెరగడమే కాదు, ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక అందుకు ఏయే చిట్కాలు పనిచేస్తాయో, ఏయే ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారాన్ని జీర్ణం చేయడంలో పైనాపిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పండ్లలో బ్రొమెలెయిన్ ఉంటుంది. ఇది ఒక ఎంజైమ్. మనం తిన్న ఆహారంలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులను సులభంగా జీర్ణం చేస్తుంది. కనుక మాంసాహారం తిన్నప్పుడు సులభంగా జీర్ణం అవ్వాలన్నా, జీర్ణ సమస్యలు ఏర్పడకుండా ఉండాలన్నా అలాంటి సందర్భంలో పైనాపిల్ ముక్కలను తినాలి. దీంతో మాంసాహారం కూడా సులభంగా జీర్ణం అయిపోతుంది. గ్యాస్ ఏర్పడదు. మలబద్దకం రాదు. అలాగే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు బొప్పాయి పండు కూడా ఎంతగానో పనిచేస్తుంది. ఈ పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అంతేకాదు ఆహారాన్ని వండేటప్పుడు పచ్చి బొప్పాయి ముక్కలను వేస్తే వంట త్వరగా అవుతుంది. మాంసం వంటి పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. మెత్తగా కూడా ఉంటాయి.
ఆహారాలను జీర్ణం చేసేందుకు కివి పండ్లు కూడా ఎంతగానో పనిచేస్తాయి. ఈ పండ్లలో ఆక్టినైడిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. కనుక మాంసాహారం తిన్నప్పుడు సులభంగా జీర్ణం అయ్యేందుకు కివి పండ్లను కూడా తినవచ్చు. ఇక పలు రకాల మసాలా దినుసులతో కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కూడా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఆహారం జీర్ణం అవ్వాలంటే చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమిలి తింటుండాలి. లేదా అల్లం రసాన్ని కూడా సేవించవచ్చు. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తింటన్నా కూడా ఫలితం ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ మోతాదులో సోంపు గింజలను నోట్లో వేసుకుని నమిలి తింటే ఎలాంటి మాంసాహారం అయినా సరే సులభంగా జీర్ణమవుతుంది.
జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతున్నా కూడా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా నల్ల ఉప్పు కలిపి తాగాలి. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి కూడా తాగవచ్చు. ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఈ మిశ్రమం కూడా బాగానే పనిచేస్తుంది. నల్ల ఉప్పును మీరు తినే ఆహారంపై చల్లి కూడా తినవచ్చు. ఇలా చేసినా కూడా ఆహారం సులభంగానే జీర్ణమవుతుంది. అలాగే దాల్చిన చెక్క నీళ్లను సేవిస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది. పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. లేదా నేరుగా పుదీనా ఆకులను నోట్లో వేసుకుని నమిలి తినవచ్చు. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల మాంసాహారం మాత్రమే కాదు, ఏ ఆహారం అయినా సరే ఇట్టే సులభంగా జీర్ణమైపోతుంది.