Diarrhea | విరేచనాలు అనేవి సహజంగానే కొందరికి అప్పుడప్పుడు అవుతుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కొందరికి లూజ్ మోషన్స్ తరహాలో అవుతాయి. కొందరికి మలం సాధారణంగానే వస్తుంది, కానీ ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. విరేచనాలు సాధారణంగా ఒక రోజుకు మించి ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. కానీ కొన్ని పరిస్థితులలో ఇవి తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకటికన్నా ఎక్కువ రోజుల పాటు విరేచనాలు ఇబ్బంది పెడుతుంటే వెంటనే డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. సాధారణ విరేచనాలకు అయితే పలు ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఇక విరేచనాలు అయ్యేందుకు అనేక కారణాలు ఉంటాయి. బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ అవడం, పలు రకాల మందులను వాడడం, కృత్రిమ తీపి పదార్థాలను అధికంగా ఉపయోగించడం, తీవ్రమైన వ్యాధులు ఉండడం వంటి కారణాల వల్ల విరేచనాలు అవుతుంటాయి.
విరేచనాలు అవుతున్నవారి శరీరం నుంచి సహజంగానే ద్రవాలు పెద్ద ఎత్తున బయటకు వెళ్తుంటాయి. కనుక ఆ ద్రవాలను భర్తీ చేసేందుకు, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. విరేచనాలు అవుతున్న వారు నీళ్లను తాగితే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. విరేచనాలు అవుతున్న వారు నీళ్లను తాగడం వల్ల అవి సులభంగా తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. విరేచనాలు అవుతున్నవారిలో నీటితోపాటు ఎలక్ట్రోలైట్లు నశిస్తాయి. కనుక వాటిని భర్తీ చేసేందుకు గాను ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ORS) ద్రావణాలను తాగాల్సి ఉంటుంది. వీటి వల్ల నీరసం రాకుండా ఉంటుంది.
విరేచనాలు అవుతున్న వారు కొబ్బరి నీళ్లను తాగితే త్వరగా అవి తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ మనకు సహజసిద్ధంగా లభిస్తాయి. కనుక శరీరం కోల్పోయిన ద్రవాలను, ఎలక్ట్రోలైట్స్‌ను సైతం తిరిగి పొందవచ్చు. విరేచనాలు అవుతున్న సమయంలో వెజిటబుల్ సూప్‌ను తాగితే మేలు జరుగుతుంది. ఎలక్ట్రోలైట్స్ లభిచడంతోపాటు విరేచనాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య వచ్చిన వారు ఎలాంటి పనిచేయకపోవడమే మంచిది. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక అల్లంను నీటిలో వేసి మరిగించి తాగితే ఉపశమనం లభిస్తుంది. పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. విరేచనాలు అవుతున్నవారు కాస్త పచ్చిగా ఉన్న అరటి పండ్లను, తెల్ల అన్నాన్ని, పొట్టు తీసిన యాపిల్ పండ్లను, బ్రెడ్‌ను తింటుంటే త్వరగా కోలుకుంటారు.
విరేచనాలు అవుతున్న వారు తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అన్నంతోపాటు ప్లెయిన్ పాస్తా, ఉడకబెట్టిన ఆలుగడ్డలు, క్యారెట్లు, పెరుగు, మజ్జిగ వంటి వాటిని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి శక్తి లభిస్తుంది. విరేచనాలు అవుతున్న సమయంలో ఫైబర్ ఉన్న ఆహారాలను తినకూడదు. లేదంటే సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలకు దూరంగా ఉంటే మంచిది. వేపుళ్లు, కొవ్వు ఉన్న ఆహారాలు, మాంసం, బటర్, సాస్, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలు, చక్కెర ఉండే పదార్థాలు లేదా పానీయాలు, టీ, కాఫీ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తీసుకుంటున్నా కూడా తగ్గడం లేదు అంటే వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వారు సరైన వ్యాధి నిర్దారణ చేసి చికిత్స అందిస్తారు. దీని వల్ల విరేచనాలు తగ్గిపోతాయి.