Body Pains | ఒళ్లు నొప్పులు అనేవి సహజంగా మనకు వస్తూనే ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. జ్వరం లేదా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లేదా శారీరక శ్రమ, వ్యాయామం చేసినప్పుడు, పలు ఇతర కారణాల వల్ల కూడా మనకు ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. అయితే ఒళ్లు నొప్పులు ఉన్నవారు సాధారణంగా పెయిన్ కిల్లర్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఇవి తాత్కాలికంగా ఉపశమనాన్ని అందించినా దీర్ఘకాలంలో పెయిన్ కిల్లర్స్‌ను వాడడం అంత మంచిది కాదు. వీటి వల్ల అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి. కనుక ఒళ్ల నొప్పులను మనం సహజసిద్ధంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను పలు ఇంటి చిట్కాలతోపాటు పలు ఆహారాలు మనకు ఎంతగానో సహాయం చేస్తాయి. ఆయా చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తీసుకుంటుంటే ఒళ్లు నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు.
ఒళ్లు నొప్పులు ఉన్నవారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల చాలా త్వరగా కోలుకుంటారు. అలాగే వేడి నీటితో స్నానం చేయాలి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడి కండరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా గాయం లేదా దెబ్బ వల్ల సంబంధిత భాగంలో నొప్పి ఉంటే ఐస్ లేదా హీట్ ప్యాక్‌లను పెట్టవచ్చు. దీంతో నొప్పి తగ్గిపోతుంది. ఇక ఒళ్లు నొప్పులు ఉన్నవారు ఎప్సం సాల్ట్‌ను నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. గోరు వెచ్చని నీటిలో ఎప్సం సాల్ట్‌ను కలపాల్సి ఉంటుంది. తరువాత ఆ నీళ్లతో స్నానం చేస్తే ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎప్సం సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం కారణంగా కండరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. అలాగే తేలికపాటి స్ట్రెచింగ్ తరహా వ్యాయామాలను చేస్తుంటే ఫలితం ఉంటుంది. వీటి వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఒళ్లు నొప్పులు ఉన్నవారు నీళ్లను అధికంగా తాగాల్సి ఉంటుంది. కొన్నిసార్లు డీహైడ్రేషన్ కారణంగా కూడా ఈ నొప్పులు వస్తాయి. కనుక నీళ్లను ఎక్కువగా తాగితే ఈ నొప్పుల నుంచి బయట పడవచ్చు. అలాగే కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసి కాసేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేస్తున్నా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఈ నూనెల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒళ్లు నొప్పులు ఉన్నవారు పసుపు, అల్లంను తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఈ రెండింటిలోనూ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి నొప్పులను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసం సేవించవచ్చు. అల్లాన్ని నీటిలో వేసి మరిగించి తాగవచ్చు. లేదా చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమిలి తినవచ్చు. ఇక గోరు వెచ్చని పాలలో పసుపు కలిపి తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది.
అల్లం ముక్క, పసుపు ముక్క, నీళ్లు, నిమ్మరసం లేదా నారింజ పండ్లు వేసి కలిపి తయారు చేసిన జ్యూస్‌లో కాస్త మిరియాల పొడి కలిపి తాగుతుండాలి. ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సూప్‌లను ఎక్కువగా తాగుతుంటే ఎంతగానో రిలీఫ్ లభిస్తుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఒళ్లు నొప్పుల నుంచి బయట పడవచ్చు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి వాపులను, నొప్పులను తగ్గిస్తాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్ బెర్రీల వంటి బెర్రీ పండ్లను తింటుంటే ఉపయోగం ఉంటుంది. సిట్రస్ జాతికి చెందిన నారింజ, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్ వంటి పండ్లను కూడా తినవచ్చు. పాలకూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వంటి ఆకుకూరలతోపాటు వెల్లుల్లి, బాదంపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు వంటి ఆహారాలను తింటుంటే ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. శరీరం రిలాక్స్ అవుతుంది.