Healthy Habits For Weight Loss | అధిక బరువు తగ్గడం అన్నది చాలా మందికి కష్టంగా ఉంటుంది. బరువు పెరిగినంత సులభంగా బరువు తగ్గరు. ఇందుకు గాను కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది. వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. తగినంత నిద్ర పోవాలి. నీళ్లు తాగాలి. వీటిని పాటిస్తేనే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇవే కాకుండా పలు అలవాట్లను కూడా పాటించాల్సి ఉంటుంది. దీంతో బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు తగ్గాలంటే రోజూ కచ్చితంగా తగినంత నీటిని తాగాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది ఉదయం నీళ్లను తాగరు. ఉదయం నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ గోరు వెచ్చని నీటిని తాగితే శరీరానికి రోజుకు కావల్సిన నీటిలో 25 శాతం వరకు నీరు ఉదయమే అందుతుంది. గోరు వెచ్చని నీటిని పరగడుపునే తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శరీరం రోజంతా క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు. కనుక ఉదయం గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకుంటే దాంతో బరువు తగ్గడం తేలికవుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఇందుకు గాను పల్లీలు, బాదంపప్పు, అవిసె గింజలు, చియా విత్తనాలు, ఓట్స్ వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ ఆహారాల్లో అధికంగా ఉంటాయి కనుక బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే చాలా మేలు జరుగుతుంది.
చేపలను వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు తింటే బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక ఇది కూడా ఒక మంచి అలవాటే అని చెప్పవచ్చు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించి అధిక బరువు తగ్గేందుకు సహాయ పడతాయి. అలాగే కంటి చూపును మెరుగు పరుస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. కనుక చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అదేవిధంగా రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. అప్పుడే మన శరీరం తనకు తాను సులభంగా మరమ్మత్తులు చేసుకుంటుంది. కొవ్వు మెటబాలిజం మెరుగు పడుతుంది. కొవ్వు కరిగి అధిక బరువు సులభంగా తగ్గుతారు.
మన శరీరానికి రోజుకు కనీసం 2వేల క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. అయితే 500 క్యాలరీలను తగ్గించి ఆహారం తీసుకోవాలి. అంటే 1500 క్యాలరీలు మాత్రమే లభించేలా ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. దీంతో మన శరీరంలో ఉండే కొవ్వు సులభంగా కరిగిపోతుంది. ఇలా పలు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. సులభంగా బరువు తగ్గుతారు.