Uric Acid Levels | మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కిడ్నీలు మన శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తాయి. దీని వల్ల రక్తంలో ఉండే మలినాలు, టాక్సిన్లు ఎప్పటికప్పుడు బయటకు పోతుంటాయి. అయితే ఇందుకు గాను నీళ్లను సరిగ్గా తాగాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించాలి. ఆహారపు అలవాట్లు కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడే కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే ఇలాంటి సూచనలు పాటించకపోవడం లేదా పలు ఇతర కారణాల వల్ల కొందరిలో కిడ్నీలు సరిగ్గా పనిచేయవు. దీంతో వ్యర్థాలు పేరుకుపోతాయి. ముఖ్యంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకు పోతుంది. ఈ యాసిడ్ నిల్వలు ఎక్కువవుతాయి. దీంతో అనేక రకాల సమస్యలు వస్తాయి.
శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పెరిగితే కిడ్నీ స్టోన్లు లేదా గౌట్ అనే సమస్యలు వస్తాయి. కిడ్నీ స్టోన్స్ గురించి అందరికీ తెలుసు. ఇక గౌట్ అంటే చిన్న చిన్న స్ఫటికాలు శరీరంలోని కీళ్లలో చేరుతాయి. అవి ఎక్కడ ఎక్కువ రోజుల పాటు ఉంటే పెద్ద స్ఫటికాలుగా మారుతాయి. దీంతో ఆ ప్రాంతంలో వాపులు, నొప్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య ముందుగా కాలి బొటన వేలి దగ్గర మొదలవుతుంది. తరువాత ఇతర కీళ్లలోనూ ఇలా కనిపిస్తుంది. అందువల్ల కాలి బొటన వేలి దగ్గర వాపు వచ్చినా లేక నొప్పి ఉన్నా వెంటనే అనుమానించాలి. అదే గౌట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. గౌట్ సమస్య వచ్చేందుకు మద్యం సేవించడం, ప్రోటీన్లను అధికంగా తీసుకోవడం కూడా కారణాలుగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకుంటే గౌట్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకునేందుకు పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెర్రీ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. చెర్రీలను తింటుంటే శరీరంలో వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి. కనుక చెర్రీ పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ కనీసం గుప్పెడు చెర్రీ పండ్లను తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తింటుండాలి. ముఖ్యంగా నిమ్మ, నారింజ, పైనాపిల్, బొప్పాయి, కివి, జామ, క్యాప్సికమ్ వంటి ఆహారాలను తింటున్నా కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గిపోతాయి. విటమిన్ సి యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఇవి ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటుండాలి.
యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు లేదా గౌట్ సమస్య ఉన్నవారు రోజూ నీళ్లను అధిక మోతాదులో తాగాలి. దీంతో కొత్తగా స్ఫటికాలు ఏర్పడవు. అలాగే ఉన్న స్ఫటికాలు కూడా కరిగిపోతాయి. దీంతో వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. చికెన్, మటన్, చేపలు, గుడ్లు, పప్పు దినుసులను తీసుకోవడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. యూరిక్ యాసిడ్ పూర్తిగా పోయే వరకు డైట్‌ను పాటించాలి. అదేవిధంగా మద్యం సేవించకూడదు, పొగ తాగకూడదు. పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం కూడా తగ్గించాలి. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. దీంతో గౌట్ సమస్య నుంచి బయట పడవచ్చు.