న్యూఢిల్లీ :మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కీలకమైన గుండె ఆరోగ్యాన్ని మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ప్రతిరోజూ అరగంట సేపు వ్యాయామం, రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఇక ఆహారం గుండె ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారంతో బీపీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా రోజూ తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా పండ్లు ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే విటిమన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ద్రాక్ష, బెర్రీస్, దానిమ్మ పండ్లు హృద్రోగాలను దరిచేరకుండా గుండెను కాపాడతాయి.
ఇక నాణ్యతతో కూడిన నూనెలను వాడటం తప్పనిసరి. ఆముదం, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి గుండెకు మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని మితంగా వాడితే వాపు ప్రక్రియను నివారించడంతో పాటు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు ఉపయోగపడతాయి. ఒమెగా 3 అధికంగా ఉండే ఆహారంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ ఆహారం మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంతో పాటు ఎల్డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మరోవైపు నిత్యం వెల్లుల్లి వాడితే రక్తం గడ్డకట్టడాన్ని నివారించి గుండె జబ్బులు దరిచేరకుండా కాపాడుతుంది.