న్యూఢిల్లీ : గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి. తక్కువ మోతాదులో రక్తంలో కొవ్వు ఉంటే అది ఉపయోగకరమే. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ 130 పైగా ఉంటే అది అధిక కొలెస్ట్రాల్‌గా పరిగణించాలి. ఇది పలు హృద్రోగాలకు దారితీసే ప్రమాదం ఉంది.
కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడుతున్నారా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా చిన్నపాటి జీవనశైలి మార్పులతో రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారంలో ఫైబర్ అధికంగా తీసుకోవాలి. పియర్స్, యాపిల్స్, బీన్స్, ఓట్స్ వంటి సాల్యుబల్ ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఇక చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పెరిగేలా చేసే సంతృప్త కొవ్వులను తగ్గించాలి.
ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం అధికంగా తీసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటితో పాటు గుండె, ఊపిరితిత్తులను దెబ్బతీసే స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. మద్యం మితంగా తీసుకోవడం మేలు కాగా పూర్తిగా మానివేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తూనే రోజుకు కనీసం అరగంట పాటు శారీరక వ్యామాయం చేయాలి.