హలో మేడం. చలికాలంలో కీళ్ల నొప్పులు అధికం అవుతాయి. ఆర్థరైటిస్లాంటి సమస్యలు ఉన్నవాళ్లకి కూడా ఎముకల నొప్పులు ఎక్కువ బాధిస్తాయి కదా! ఇలాంటి వాళ్లు వీటి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఆహారపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుపగలరు?
చలికాలంలో కండరాలు సంకోచిస్తాయి. దాంతో కీళ్ల కదలికలు మందగించి, కాస్త బిగుతుగా తయారవుతాయి. అంతేకాదు, కండరాలు పట్టేయడం కారణంగా రక్త సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో కీళ్లు, కండరాల నొప్పులు ఏర్పడతాయి. వెచ్చని దుస్తులు ధరించడం, అవసరం అయినప్పుడు హీట్ ప్యాడ్లు వాడటంతో పాటు పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడంలాంటి వాటి ద్వారానూ ఈ సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఆహారంలో ఇవి చేర్చుకున్నా… కీళ్లు కండరాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు.
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపుల్ని తగ్గిస్తాయి. సాల్మన్, సార్డిన్, ట్యూనాలాంటి చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల కీళ్ల నొప్పులూ తగ్గుతాయి. చేప వేపుడు బదులు, గ్రిల్డ్ చేపలు తినేందుకు ప్రయత్నించడం మంచిది.
నీళ్లు కీళ్లలో లూబ్రికెంట్‌లా పనిచేస్తాయి. అందుకే చలికాలంలో ఎక్కువ నీళ్లు తాగాలి. అలాగే సూప్‌లు, స్మూతీల్లాంటివి.. నీటి పాళ్లు ఎక్కువగా ఉండే క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్, లెట్యూస్లాంటి కూరగాయలూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
కీళ్ల చుట్టూ ఉండే మృదులాస్థిలో భాగమైన కొలాజెన్ తయారీలో విటమిన్-సి కీలకంగా వ్యవహరిస్తుంది. దీనికి కూడా వాపుల్ని తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) స్వభావం ఉంది. అందుకే కమలా, బత్తాయి, దానిమ్మ, కివీలాంటి పండ్లతో పాటు క్యాప్సికం, బ్రకోలీలాంటివి ఎక్కువగా తినాలి.
వాల్నట్, పిస్తా, బాదంలాంటి గింజల్లో మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి కీళ్లలో కందెనలా పనిచేస్తాయి.
పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపుల్ని తగ్గిస్తాయి.
అల్లంలో ఉండే జింజరోల్ కీళ్లు సులభంగా కదిలేందుకు సాయపడుతుందని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. వయసు రీత్యా వచ్చే నొప్పులు, అంతకు ముందే ఉండే కీళ్ల నొప్పుల్ని కూడా తగ్గించడంలో ఇది ఉపకరిస్తుంది.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@gmail.com