Finger Millet | ప్రస్తుత చిరుధాన్యాల వాడకం పెరిగింది. చాలా మంది వీటిని తినేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. చిరు ధాన్యాల విషయానికి వస్తే వాటిల్లో రాగులు కూడా ఒకటి. రాగులతో రాగి ముద్ద, రాగి జావ, రొట్టె వంటివి చేసుకుని తింటుంటారు. రాగులను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. చిన్నారులు, వృద్ధులు రాగులను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి. పాలిచ్చే తల్లులు కూడా రాగును తింటే శిశువుకు ఎంతో మేలు జరుగుతుంది. శిశువు ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. చక్కగా ఎదుగుతారు.
డయాబెటిస్ ఉన్నవారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రాగులను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రాగుల్లో అధికంగా ఉండే ఫైబర్, పాలిఫినాల్స్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. అధికంగా బరువు ఉన్నవారు బరువును తగ్గించుకునేందుకు గాను రాగులు సహాయం చేస్తాయి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధంగా మనకు లభిస్తుంది. అందువల్ల రాగులను తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులలో వచ్చే రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. రాగుల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక ఫినోలిక్ సమ్మేళనాలు సైతం ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేందుకు సహాయం చేస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే చర్మ కణాలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.
రాగులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగుల్లో లెకిథిన్, మిథియోనైన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. రాగుల్లో ఉండే మెగ్నిషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే రాగులను రోజూ ఎంత మోతాదులో తినాలి..? అని చాలా మందికి సందేహం ఉంటుంది. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన పరిశోధకులు ఏం చెబుతున్నారంటే.. రాగులను పిండి రూపంలో తీసుకుంటే రోజుకు 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. మరీ అధికంగా తింటే శరీరంలో ఆగ్జాలిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్లను కలగజేస్తుంది. కనుక రాగులను రోజూ మోతాదులోనే తినాలి.