న్యూఢిల్లీ : ఏ సీజన్లోనైనా తాజా పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. పండ్లలో పలు పోషకాలతో పాటు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో అవి ఆరోగ్యకరమైన ఆహారమే కాకుండా పలు వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడతాయి. అయితే అతిగా తీసుకుంటే పండ్లయినా ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రోజుకి రెండు కప్పుల పండ్ల ముక్కలు తీసుకుంటే బీపీ, కొవ్వు లెవెల్స్ అదుపులో ఉండటంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. స్ట్రోక్, గుండెపోటు ముప్పును తగ్గిస్తాయి. అయితే అదే సమయంలో అదే పనిగా కడుపును పండ్లతో నింపితే పండ్లలో ఉండే ఫైబర్, సహజంగా ఉండే చక్కెర (ఫ్రక్టోజ్)లు ఇతర ద్రవాలతో కలిసి కొందరిలో డయేరియాకు దారితీయవచ్చు.
పండ్లను అతిగా తినడం ద్వారా చక్కెర నిల్వలు అధికమై బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహ రోగులు పండ్లను ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. పండ్లను పరిమితికి మించి తింటే గ్యాస్, కడుపులో అసౌకర్యం, జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి.