Chewing Gums | ముఖం సన్నగా కనిపించాలన్నా, దవడ ఆకృతి (జాలైన్) స్పష్టంగా రావాలన్నా చూయింగ్ గమ్‌ను ఎక్కువసేపు నమలడం ఉపయోగపడుతుందనే అభిప్రాయం యువతలో బలంగా ఉంది. దీంతో చాలామంది రోజూ గంటల తరబడి చూయింగ్ గమ్ నమలడం అలవాటుగా మార్చుకుంటున్నారు. అయితే ఇది ముఖాన్ని సన్నగా చేయకపోగా, దవడ కీళ్లపై అనవసర ఒత్తిడి పెంచి పలు ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దవడను పుర్రెతో కలిపే కీళ్లను టెంపరోమ్యాండిబ్యులర్ జాయింట్ (TM Joint) అంటారు. చెవులకు ముందు భాగంలో ఉండే ఈ కీళ్లు నమలడం, మాట్లాడడం, నోరు తెరవడం-మూయడం వంటి ప్రతి కదలికలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అప్పుడప్పుడు చూయింగ్ గమ్ నమలడం వల్ల సాధారణంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ గంటల తరబడి నిరంతరం నమలడం వల్ల ఈ కీళ్లపై పదేపదే ఒత్తిడి పడుతుంది.
చూయింగ్ గమ్‌ను ఎక్కువసేపు నమలడం వల్ల దవడ కండరాలు అధికంగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో క్రమంగా దవడ కీళ్లలో ఒత్తిడి పెరిగి కండరాలు అలసిపోవడం, కీళ్ల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక దవడ సమస్యలు తలెత్తుతాయి. దవడ కీళ్లపై అధిక ఒత్తిడి పడటం వల్ల కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నోరు తెరిచినప్పుడు లేదా మూసినప్పుడు దవడ వద్ద క్లిక్ అనే శబ్దం వినిపించడం, దవడ బిగుసుకుపోవడం, చెవుల పక్కన లేదా కణతల వద్ద తలనొప్పి రావడం, ఆహారం నమిలేటప్పుడు నొప్పి అనిపించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చూయింగ్ గమ్ ను నమలడం వల్ల ముఖంలోని కొవ్వు కరిగి ముఖం సన్నగా మారుతుందనే అభిప్రాయానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది దవడ కండరాలను కొంతవరకు బలపరుస్తుంది. కానీ శరీరంలోని ఒకే భాగంలో కొవ్వును కరిగించడం సాధ్యం కాదు. కొవ్వు తగ్గడం మొత్తం శరీర బరువు తగ్గుదలతో సంబంధం ఉన్న ప్రక్రియ. కాబట్టి చూయింగ్ గమ్‌ను ముఖానికి వ్యాయామంగా భావించడం సరైనది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దవడ కీళ్లు కూడా శరీరంలోని ఇతర కీళ్ల మాదిరిగానే పరిమితంగా ఉపయోగించినప్పుడే ఆరోగ్యంగా ఉంటాయి. అవసరానికి మించి నిరంతరం ఒత్తిడి పెడితే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అప్పుడప్పుడు చూయింగ్ గమ్ నమలడం సాధారణంగా హానికరం కాకపోయినా, అలవాటుగా గంటల తరబడి నమలడం మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.