న్యూఢిల్లీ : అధిక బరువుతో సతమతమయ్యే వారు, ఆరోగ్యకర ఆహారం తీసుకునేవారు పరోటాలకు దూరం కావాలా అని పలువురిలో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. టేస్టీ పరోటాలను ఆరోగ్యకరమైన మార్పులతో తయారు చేసుకుని తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డైట్ ప్లాన్‌లో ఉన్నవారు పరోటాలను మితంగా, పోషకాలతో కూడిన విధంగా చేసుకుని ఆహారంలో భాగం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
గోధుమ పిండి పడనివారు గ్లూటెన్ను పక్కనపెట్టేందుకు ఓట్స్, రాగి పిండితోనూ పరోటాలను తయారుచేసుకోవచ్చు. ఫైబర్, విటమిన్లు, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉండే మల్టీ గ్రెయిన్ ఫ్లోర్‌తో వీటిని చేసుకుంటే ఆరోగ్యకరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పరోటాల్లో స్టఫింగ్ కోసం తాజా సీజనల్ కూరగాయాలను ఉపయోగించడం మేలు.
ఇక నూనె తక్కువగా ఉపయోగించి పరోటాలను తయారుచేస్తే మేలని, నాణ్యతతో కూడిన నూనె వాడాలని చెబుతున్నారు. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వంటి నూనెలు వాడటం మేలు. ట్రాన్స్ ఫ్యాట్స్ తక్కువగా ఉండే నూనెలను ఉపయోగించాలి. ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో కూడిన నెయ్యి పరోటాల పైన వేయవచ్చని, ఇది గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.