Experts Alert | దేశంలో దాదాపు మూడేళ్లుగా కరోనా ప్రభావం కొనసాగుతున్నది. రూపం మార్చుకుంటూ విరుచుకుపడగా.. కోట్లాది మంది జనం మహమ్మారి బారినపడ్డారు. గత నెల రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కొత్త కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయని, ఈ వేరియంట్లు సహజంగానే వేగంగా వ్యాప్తిచెందే అవకాశాలుంటాయని, టీకాలు తీసుకున్న వారికి సైతం ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. మహమ్మారి కొనసాగుతున్న క్రమంలోనే పలు రాష్ట్రాల్లో పలు రకాల ఇన్ఫెక్షన్లు సోకుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇటీవల దేశంలో మంకీపాక్స్ కేసులు కేరళలో నమోదయ్యాయి. దీంతో ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత ఆరు నెలల్లో వివిధ రకాల అంటువ్యాధుల కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ప్రస్తుతం దేశంలో ఉన్న ఇన్ఫెక్షన్లపై నిపుణులు హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి ముప్పు ఇప్పట్లో తొలిగేలా లేదు. గత 24 గంటల్లో 21,566 మందికి వైరస్ సోకింది. అయితే, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.5 కారణంగా చాలా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, పలు అధ్యయనాల్లో ఈ వేరియంట్‌కు ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉంటుందని తేలింది. టీకాలు వేసిన వ్యక్తులు సైతం వేరియంట్ బారినపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియంటే కాకుండా పలు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ఇప్పటి వరకు ఐరోపా దేశాలకు పరిమితమైన మంకీపాక్స్ వైరస్ ప్రస్తుతం భారత్‌కు పాకింది. కేరళకు చెందిన ఇద్దరికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యక్తుల్లో మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో కేరళలోని 14 జిల్లాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. మంకీపాక్స్ అరుదైన ఇన్ఫెక్షన్ కాగా.. ఇప్పటి వరకు ఆఫ్రికల్ దేశాల్లో ఎక్కువగా కనిపించింది. గత జనవరి నుంచి యూరోపియన్ దేశాల్లో కేసులు వేగంగా పెరిగాయి. తాజాగా భారత్‌లోనూ కేసులు నమోదయ్యాయి. కేరళలోనే ఇద్దరికి మంకీపాక్స్ సోకింది.
కేరళలో టొమాటో ఫీవర్ కేసులు సైతం నమోదయ్యాయి. కొల్లాం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 80 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్తో శరీరంపై ఎరువు రంగులో బొబ్బలు ఏర్పడుతాయి. దీంతో దీనికి ‘టొమాటో ఫ్లూ’గా పేరుపెట్టారు. ఇది ఓ అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్. గట్‌పై దాడి చేసే షిగెల్లా బ్యాక్టీరియా ఇది. దీన్ని షిగెల్లోసిస్ అని పిలుస్తారు. నోటి ద్వారా ప్రవేశించి పేగులపై అధిక ప్రభావం చూపిస్తుంది. ఇది సోకిన వెంటనే మోషన్స్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో రక్త విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. షిగెల్లా బ్యాక్టీరియా సోకిన ఆహారాన్ని తినడం, ఆ బ్యాక్టీరియా సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కేసులు సాధారణంగా ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కనిపిస్తాయి. బ్యాక్టీరియా సోకినవారి శరీరంపై బొబ్బలతో పాటు తీవ్ర జ్వరం, శరీరంలో విపరీతమైన నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇటీవల భారీ వర్షాలకు పలు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ‘లెప్టోస్పిరోసిస్’ ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘లెప్టోస్పిరోసిస్’ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. లెప్టోస్పిరోసిస్కు కారణమయ్యే బ్యాక్టీరియా కారణంగా నీరు, నేల కలుషితమైతే మనుషులకు సోకే ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. లెప్టోస్పిరోసిస్ తీవ్రమైన సందర్భాల్లో 10 నుంచి 15శాతం మధ్య మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.