అనలతల్పమైన నూనెలో చక్కగా వేయించిన పకోడీలు తింటుంటే మజా అనిపిస్తుంది. సలసల మసిలే ఆయిల్లో మునకేసిన బజ్జీలు ప్రియంగా తింటాం. అంతెందుకు.. ఇంట్లో తిరగమోతలో కాస్త నూనె ఎక్కువగా వెయ్యమని ఆర్డర్లు జారీ చేస్తుంటాం. పండుగల వేళ పిండి వంటలు సరేసరి! జిహ్వ చాపల్యం కొద్దీ నూనెలో మునిగి తేలిన పదార్థాల చుట్టూ తిరుగుతుంటారు చాలామంది! అయితే, ఆయిల్‌ఫుడ్‌తో అంటకాగితే గుండెకు ముప్పు తప్పదు. ఆయిల్ బ్రాండ్ ఏదైనా… నూనె పదార్థాలు మితిమీరి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలకు దారితీస్తుంది.
వనస్పతి: ప్రస్తుతం అనేక కుటుంబాలు వనస్పతిని విరివిగా వాడుతున్నాయి. కానీ దాన్ని తయారు చేసే ప్రక్రియలో హైడ్రోజనేషన్ చేస్తారు. ఈ ప్రక్రియలో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉత్పత్తి అవుతాయి. వాటివల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీన్ని పూర్తిగా వాడకపోవడం ఉత్తమం.
పామ్ ఆయిల్: తక్కువ ధరకే లభించే ఈ పామ్ ఆయిల్‌ను హోటల్స్, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అత్యధికంగా వాడుతుంటారు. కానీ, ఇందులో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెలోని ధమనుల్లో ప్లాక్ పేరుకుపోయేందుకు దారి తీస్తాయి. పామ్ అయిల్ వాడకం వల్ల కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
రిఫైన్డ్ ఆయిల్: రిఫైన్డ్ సన్‌ఫ్లవర్, సోయాబీన్, కార్న్ ఆయిల్ వంటివి ఆరోగ్యకరమైనవిగానే కనిపించినా, తయారీ ప్రక్రియలో సహజ పోషకాలను కోల్పోతాయి. వాటిలో రసాయన అవశేషాలు, ఆక్సిడైజ్డ్ ఫ్యాట్స్ చేరడంతో శరీరానికి హాని చేకూరుతుంది. వీటిలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ తలెత్తుతుంది. రిఫైన్డ్ నూనెలకు బదులు తక్కువ ప్రాసెస్ చేసిన నూనెలను మితంగా వాడటం మంచిది.
కాటన్‌సీడ్ ఆయిల్: స్నాక్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వాడే ఈ నూనెల్లో సాచ్రేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా-6 అధిక మోతాదులో ఉండటంతో పాటు గాసిపాల్ అనే సహజ విషపదార్థం కూడా ఉంటుంది. ఈ విషపదార్థం పూర్తిగా తొలగించకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. ఒమేగా-6, ఒమేగా-3ల మధ్య సమతౌల్యం లోపించి గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
కొబ్బరినూనె: ఇటీవలి కాలంలో కొబ్బరినూనెను ఆరోగ్యకరమైనదిగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇందులో 90 శాతం సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. తక్కువ మోతాదులో వాడితే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మొత్తంలో వాడితే ఇబ్బందులు తప్పవు.