Foods | ప్రస్తుత కాలంలో చిరుతిళ్లు, వివిధ రకాల ఆహార పదార్థాల మార్కెట్ ను పెంచుకోవడానికి వాటిని ఆరోగ్యానికి మేలు చేసేవిగా చెప్పి అమ్ముతున్నారు. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయని చెప్పడం వల్ల ప్రజలు వాటిని కొనుగోలు చేసి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే సేంద్రీయ పద్దతుల్లో తయారు చేసిన ఆహార పదార్థాలు అనగానే ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాలు అని చెప్పినప్పటికీ వీటికి తీపిని జత చేస్తూ ఉంటారు. దీంతో వాటిలో క్యాలరీలు పెరుగుతాయి. ఆహారానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు అని బ్రాండ్ ఉన్నప్పటికీ వీటిలో చక్కెరలు లేవని అర్థం కాదు. అంతేకాకుండా వీటిని కల్తీ చేయవచ్చు లేదా వాటి పోషకాహార సూచికలను తప్పుగా ముద్రించవచ్చు. ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాల పేరుతో మార్కెట్ లో లభించే కొన్ని ఆహారాల గురించి అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు ఏవిధంగా పెరుగుతుందో వైద్యులు వివరాలను వెల్లడిస్తున్నారు.
గింజలు, విత్తనాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీటిని మనం రోజుకు 25 నుండి 30 గ్రాముల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అయితే ప్రాసెస్ చేసిన గింజలు చాలా రుచిగా ఉంటాయి. దీంతో వాటిని ఎక్కువ మొత్తంలో తింటూ ఉంటారు. వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. కనుక ప్రాసెస్ చేసిన గింజలకు బదులుగా ముడి గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్రాసెస్ చేసిన అవకాడో డిప్స్, సాస్ లల్లో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు కూడా ఉంటాయి. ప్రాసెస్ చేసిన అవకాడో డిప్ లను తీసుకోవడం వల్ల క్యాలరీలు ఎక్కువై శరీర బరువు పెరుగుతుంది. కనుక అవకాడోలను నేరుగా తీసుకున్నప్పుడే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
కూరగాయలు, పండ్లతో చేసిన రెడీమెడ్ స్మూతీలు మనకు మార్కెట్ లో లభిస్తూ ఉంటాయి. పండ్లు, కూరగాయలతో చేయడం వల్ల ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిలో చక్కెరలు అధికంగా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు క్యాలరీలు కూడా పెరుగుతాయి. కనుక తాజా పండ్లతో అప్పటికప్పుడు స్మూతీలను చేసి తీసుకోవడం మంచిది. ప్యాకెట్ లలో లభించే గ్రానోలా, కార్న్‌ఫ్లేక్స్ వంటి వాటికి చక్కెరను జత చేసి అమ్ముతూ ఉంటారు. ఇవి ఆరోగ్యకరమే అయినప్పటికీ చక్కెరలను జత చేయడం వల్ల క్యాలరీల శాతం పెరుగుతుంది. దీంతో వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. కనుక వీటి ఎంపికలో జాగ్రత్త వహించడం చాలా అవసరం.
ప్రోటీన్ బార్ లేదా ఎనర్జీ బార్ లను తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు కంటే హానే ఎక్కువగా ఉంటుంది. వీటిలో చక్కెరలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇంట్లోనే చక్కెరలు లేకుండా ప్రోటీన్ బార్ లను తయారు చేసుకోవడం మంచిది. సలాడ్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిలో వాడే సలాడ్ డ్రెస్సింగ్స్ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ డ్రెస్సింగ్స్ లో కొవ్వును పెంచే పదార్థాలతో పాటు హానికరమైన పదార్థాలు కూడా ఉంటాయి. కనుక ఇంట్లోనే ఈ డ్రెస్సింగ్స్ ను తయారు చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకునేటప్పుడు ప్యాకెట్ వెనుక ఉండే లేబుళ్లను పరిశీలించడం చాలా అవసరం. అదనంగా జోడించిన చక్కెరలు ఉండే ఆహారాలను తినకూడదు. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.