న్యూఢిల్లీ : దేశీ వంటకాలు అనగానే కిచిడీ డిష్ గుర్తుకురావడం సహజమే. తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకునే వెసులుబాటు ఉన్న కిచిడీలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పొంగల్, హగ్గి, బిసిబిళాబాత్, పులగం ఇలా పలు ప్రాంతాల్లో వివిధ పేర్లతో కిచిడీని పిలుస్తుంటారు. కూరగాయలు, ఆకుకూరలు, మసాలా దినుసులతో తయారుచేసే కిచిడీని ఇష్టపడని వారు అరుదు. అధిక బరువు సమస్యను కిచిడీతో అధిగమించవచ్చన్నది నిపుణుల మాట.
ఇక సగ్గుబియ్యం కిచిడీ ఆరోగ్య ప్రయోజనాలకు మరింత శ్రేష్టమని న్యూట్రిషియన్లు పేర్కొంటున్నారు. అన్ని పోషకాలతో కూడిన కిచిడీ సులభంగా జీర్ణం కావడంతో పాటు ఇందులో ఉండే ఫైబర్ వలన మలబద్ధకం, గ్యాస్, డయేరియా వంటి జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తుంది. ఈ డిష్‌లో ఉండే లో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) కారణంగా శరీరంలో చక్కెర స్ధాయిలను సమర్ధంగా నిర్వహించడంలో సాయపడుతుంది.
కిచిడీలో ఉండే ఫైబర్, ప్రొటీన్, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి శక్తినివ్వడంతో పాటు కండరాల పుష్టికి దోహదపడతాయి. ఇందులో వాడే మిరియాలు, అల్లం, పసుపు, కూరగాయలు, మసాలా దినుసుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపు ప్రక్రియను నివారిస్తాయి. తక్కువ క్యాలరీలు, కొవ్వు శాతం తక్కువగా ఉండటంతో కిచిడీ గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.