Empty Stomach Foods Not To Eat | మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన రోజును ఆరోగ్యకరమైన ఆహారాలతో ప్రారంభించాలి. ఉదయాన్నే అనారోగ్యకరమైన ఆహారాలను తింటే ఆ రోజంతా మనకు ఏదో ఒక సమస్య వస్తుంది. అలాగే పొట్టలో అసౌకర్యం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతోపాటు శరీరంలో క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు. ఇది ఇతర వ్యాధులకు కారణమవుతుంది. కనుక ఉదయం ఎట్టి పరిస్థితిలోనూ ఆరోగ్యకరమైన ఆహారాలను తినాల్సి ఉంటుంది. అయితే కొందరు తెలియక ఉదయం పూట పలు ఆహారాలను ఖాళీ కడుపుతో తింటుంటారు. ఇవి పొట్టలో అసౌకర్యంతోపాటు జీర్ణ సమస్యలను, ఇతర అనారోగ్యాలను కలగజేస్తాయి. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోకూడదని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మ, నారింజ, ద్రాక్ష, పైనాపిల్ వంటి పండ్లలో విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే ఉదయం ఖాళీ కడుపుతో మాత్రం ఈ పండ్లను తినకూడదు. ఇవి జీర్ణాశయంలో అధికంగా ఆమ్లాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో కడుపులో మంట, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో వీటిని తినకూడదు. అలాగే టీ లేదా కాఫీని కూడా ఉదయం పరగడుపున తాగకూడదు. చాలా మంది ఉదయం నిద్ర లేవగానే పరగడుపునే వీటిని సేవిస్తుంటారు. ఇలా ఖాళీ కడుపుతో వీటిని తాగడం మంచిది కాదు. ఇవి యాసిడ్లు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో కడుపులో మంట పెరుగుతుంది. పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. కనుక టీ, కాఫీలను కూడా పరగడుపున సేవించడం మానేయాలి.
ఉదయం పరగడుపునే తీపి పదార్థాలు లేదా చక్కెర అధికంగా ఉండే పదార్థాలను, పిండి పదార్థాలను అధికంగా తినరాదు. ఇవి షుగర్ లెవల్స్‌ను అమాంతం పెంచుతాయి. దీంతో శరీరం ఆ ఆహారాలను జీర్ణం చేసేందుకు శ్రమిస్తుంది. ఫలితంగా బద్దకంగా అనిపిస్తుంది. ఉదయం నుంచే యాక్టివ్‌గా ఉండలేరు. ఏ పని చేయాలనిపించదు. అదేవిధంగా పచ్చి కూరగాయలను కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది త్వరగా జీర్ణం కాదు. దీంతో అజీర్తి సమస్య ఏర్పడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వస్తాయి. అలాగే పచ్చి కూరగాయల్లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. కనుక పరగడుపున వీటిని తినడం అంత మంచిది కాదు.
కొందరు ఖాళీ కడుపుతో కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను ఉదయమే తింటుంటారు. ఇలా తినడం జీర్ణవ్యవస్థకు చాలా హానికరం. ఇలా తింటే జీర్ణాశయం, పేగుల గోడలు ఆమ్లత్వానికి డ్యామేజ్ అవుతాయి. దీర్ఘకాలంలో ఇది అల్సర్‌కు దారి తీస్తుంది. కనుక ఉదయం పరగడుపున కారం, మసాలాలను తినడం మంచిది కాదు. కొందరు ఉదయం ఖాళీ కడుపుతో అరటి పండ్లను తింటుంటారు. ఇలా తినడం కూడా మంచిది కాదు. దీని వల్ల శరీరంలో మెగ్నిషియం, క్యాల్షియం స్థాయిలు పెరుగుతాయి. దీంతో వాటిని బయటకు పంపించడం కోసం శరీరం శ్రమించాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక అరటి పండ్లను కూడా పరగడుపునే తినకూడదు. ఇలా పలు రకాల ఆహారాలను ఖాళీ కడుపుతో తినడం మానేయాలి. లేదంటే లేని పోని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు.