క్రిస్మస్, ఆంగ్ల సంవత్సరాది పండుగల సందడి ముగిసింది. అంతకుముందో.. ఆ తర్వాతో ఎవరో ఒకరి పుట్టినరోజో.. పెళ్లిరోజో ఉండే ఉంటుంది. ఈ అన్ని సందర్భాల్లోనూ కామన్‌గా ఉండేది.. కేక్! వేడుకలు అనేకాదు, ఇప్పుడు అకేషన్ ఏదైనా.. కేక్ కోయడం ఆనవాయితీగా వస్తున్నది. కొందరికి సందర్భంతో సంబంధం లేకుండా.. ఈ తీపి పదార్థాన్ని తినడం అలవాటుగా మారింది. అయితే, అతి సర్వత్రా వర్జ్యయేత్ అన్నట్లు.. కేక్ అతిగా తింటే ఆరోగ్యానికి హానికలిగే ప్రమాదం ఉన్నది.
కేక్ తయారీలో చక్కెర, నూనెలను ఎక్కువగా వాడుతారు. వీటిని తరచుగా తింటే.. శరీరంలో క్యాలరీలు పేరుకుపోతాయి. ఫలితంగా, ఇట్టే బరువు పెరుగుతారు. రెగ్యులర్‌గా కేక్ తినేవాళ్లు.. ఊబకాయం బారినపడే ప్రమాదమూ లేకపోలేదు.
కేక్‌లు ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు.. వాటిలో కొన్నిరకాల ప్రిజర్వేటివ్స్ వాడుతారు. ఆరోగ్యంపై ఇవి తీవ్రంగా ప్రభావితం చూపిస్తాయి.
ఇక కేక్ అందంగా కనిపించడానికి.. వాటి అలకరణల కోసం వాడే కృత్రిమ రంగులు క్యాన్సర్‌ను కలగజేస్తాయి. రోగ నిరోధక శక్తినీ నిర్వీర్యం చేస్తాయి. పిల్లల్లో హైపర్యాక్టివిటీని ప్రేరేపిస్తాయి.
కేక్ తయారీలో వాడే కొన్నిరకాల రసాయన పదార్థాలు, బేకింగ్ సోడా వంటివి.. తలనొప్పికి కారణం అవుతాయి. అలర్జీనీ కలిగిస్తాయి.
మధుమేహ రోగులకు కేక్స్.. విషంతో సమానం. వీటిని సందర్భానుకూలంగా తీసుకున్నా.. రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా పెరుగుతాయి. రోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. చక్కెర వ్యాధిలేనివారినీ ఈ ఊబిలోకి లాగేస్తాయి.
ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచే కూల్కేక్ లాంటి వాటిలో.. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయి.. అవయవాల పనితీరును నిరోధిస్తాయి.
కేక్ తయారీలో వాడే కొన్నిరకాల కొవ్వులు.. గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిలో ఉపయోగించే ప్రాసెస్డ్ పిండి పదార్థాలు.. జీర్ణ సమస్యలనూ తెచ్చిపెడతాయి.
కేక్‌లో ఉండే చక్కెర.. దంతాల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. దంతాలపై పాచి ఏర్పడటానికి కారణం అవుతుంది. కేక్ తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోతే.. దంత క్షయానికీ దారితీస్తుంది.
కేక్ తినడం.. కొందరిలో అలర్జీలకు దారితీస్తుంది. తరచుగా కేక్ తినేవారిలో.. ఆందోళన, నిరాశ, మూడ్ స్వింగ్స్ వంటి మానసిక సమస్యలూ కనిపిస్తాయి.
కేక్ తినడం వల్ల శరీరానికి అందే పోషకాలు చాలాచాలా తక్కువ. అందుకే, వీటిని ఎక్కువగా తింటే అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి.