న్యూఢిల్లీ : ఆధునిక జీవితంలో మనలో చాలామందిని నిద్రలేమి వెంటాడుతుంది. వేళాపాళా లేకుండా నిద్రకు ఉపక్రమించడం, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల మందులు, డిప్రెషన్ వంటి పలు కారణాలు నిద్రలేమికి దారితీస్తుంటాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్టే నిద్రపైనా ప్రభావం చూపుతాయి.
ఆరోగ్యకర ఆహార అలవాట్లతో నిద్రలేమిని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి వేళ రోజూ ఒకే సమయంలో నిద్రకు ఉపక్రమించడం కీలకమని, చెబుతున్నారు. ఉదయం కెఫిన్‌తో కూడిన కాఫీ, టీలు మూడ్‌ను ఉత్తేజపరిచేందుకు ఉపయోగపడినా రాత్రి వేళల్లో వాటికి దూరంగా ఉండాలి. ఎనర్జీ డ్రింక్స్‌ను అధికంగా తీసుకున్నా నిద్ర లేమి వేధిస్తుంది. అందుకే వాటిని సాయంత్రం వేళ, నిద్రించే ముందు తీసుకోరాదు.
ఇక నిద్రించే ముందు మసాలా అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది కాదు. రాత్రి వేళ గ్యాస్, అసిడిటీ సమస్యలతో నిద్రకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ ఆహారపు అలవాట్లను సరిచేసుకోవడంతో పాటు రోజూ తగినంత నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా కుంగుబాటు సమస్యలనూ అధిగమించి చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు.