Pineapple | పైనాపిల్ పండు చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండదు. అలాగే రుచి కూడా పుల్లగా ఉంటుంది. కనుక చాలా మంది ఈ పండును తినేందుకు వెనుకడుగు వేస్తుంటారు. అయితే వాస్తవానికి పైనాపిల్ పండు మనకు లభించిన వరం అనే చెప్పవచ్చు. ఈ పండ్లను రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. పైనాపిల్ పండును కనీసం రోజుకు ఒకటి లేదా ఒక కప్పు పైనాపిల్ పండు ముక్కలను అయినా తినాలని వారు సూచిస్తున్నారు. పైనాపిల్ పండును రోజూ తినడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని వారు అంటున్నారు.
పైనాపిల్ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి వల్ల మన శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మం సాగే గుణాన్ని ప్రేరేపిస్తుంది. చర్మం దృఢంగా ఉండేలా చేస్తుంది. పైనాపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ముఖంపై ముడతలు, మచ్చలు, గీతలు ఉండవు. ముఖం కాంతివంతంగా మారుతుంది. పైనాపిల్ పండ్లను తినడం వల్ల మనకు కలిగే అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే.. జీర్ణశక్తి పెరుగుతుంది.
పైనాపిల్ పండ్లలలో బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తినే ప్రోటీన్లను త్వరగా జీర్ణం చేస్తుంది. మాంసాహారం తిన్నప్పుడు సరిగ్గా జీర్ణం అవ్వాలంటే పైనాపిల్ పండ్లకు చెందిన ముక్కలను నమిలి తింటుంటే ఫలితం ఉంటుంది. ప్రోటీన్లను త్వరగా జీర్ణం చేసే శక్తి పైనాపిల్ కు ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తరచూ తింటుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
పైనాపిల్ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, సైనస్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి లేదా గాయాలు, పుండ్లు అయిన వారికి పైనాపిల్ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే ఆయా సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు. పైనాపిల్ పండ్లు సహజసిద్ధమైన డై యురెటిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల శరీరంలో అధికంగా ఉండే నీటిని ఇవి బయటకు పంపుతాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీవ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
పైనాపిల్ పండ్లలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. రోజుకు ఒక పైనాపిల్‌ను తింటే శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో జలుబు తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పైనాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి బీపీని నియంత్రిస్తుంది. దీంతో గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. ఇలా పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ మరిచిపోకుండా తినండి.