అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా తిండికి ఉపక్రమిస్తే.. అర్ధరాత్రి దయ్యాలు తింటాయని పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు. నడిజాములో తినకుండా ఉండేందుకే మన పెద్దలు ఇలాంటి మాటలు చెప్పడం మొదలు పెట్టారనీ, ఇది ఆచరణలో ఎంతో మేలు చేస్తుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. పట్టణ జీవన శైలి ఇప్పుడు పల్లెలకూ విస్తరించింది.
అర్ధరాత్రి బిర్యానీ, పిజ్జాలే కాదు హెల్దీ సలాడ్స్ తిన్నా ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయకపోగా కీడే చేస్తాయట. సగం రాత్రిలో తింటే సరైన నిద్రపోలేరట. శక్తిగా మారిన ఆహారం దేహం వినియోగించుకోలేక పోవడంతో అది కొవ్వుగా మారిపోతుంది. అందువల్ల ఒక్క ఊబకాయమే కాదు దానితోపాటు డయాబెటిస్, గుండె జబ్బులు, హార్మోన్ల అసమతుల్యతలాంటి ఇబ్బందులు చుట్టు ముడతాయి.
తినగానే నిద్రకు ఉపక్రమిస్తే అది సరిగా జీర్ణం కాక అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. పసందైన వంటకాలు తినేముందు ధరలే కాదు సమయం కూడా చూసుకోవాలని దీనినిబట్టి అర్థమవుతుంది. స్వీయ నియంత్రణ లేకపోతే సొమ్ము పోయి శని పట్టుకుంటుంది.