రోజూ వీలైనంత త్వరగా భోజనం పూర్తి చేస్తే.. గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పు తగ్గుతుందని ‘నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్’లో ప్రచురితమైన ఓ అధ్యయనం నిర్ధారించింది. ఇందుకోసం పరిశోధకులు 1,03,389 మంది నుంచి ఆహార విధానాలు, గుండె రక్తనాళాల జబ్బులకు సంబంధించిన సమాచారం సేకరించారు. వీరిలో 79 శాతం మహిళలే. పరిశోధనలో పాల్గొన్నవారి సగటు వయసు 42 ఏండ్లు.
వయసు, లింగం, కుటుంబం .. మొదలైన సామాజిక పరిస్థితులు, ఆహారంలో పోషకాల నాణ్యత, జీవనశైలి, నిద్ర తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారు. పొద్దున్నే టిఫిన్ చేయకుండా నేరుగా భోజనం చేసేవారిలో ఒక్కో గంట ఆలస్యానికి గుండె రక్తనాళాల వ్యాధుల తీవ్రత 6 శాతం పెరుగుతుందని కనుగొన్నారు. అంటే, పొద్దున్నే 9 గంటలకు తినే వ్యక్తికి, 8 గంటలకే తిన్న వ్యక్తితో పోలిస్తే గుండె రక్తనాళాల జబ్బుల ముప్పు 6 శాతం ఎక్కువన్నమాట.
తొమ్మిది తర్వాత ఒక్కో గంట గడుస్తున్నకొద్దీ ఈ ముప్పు 28 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. అయితే, ముందురోజు రాత్రి చివరి భోజనానికి, తర్వాతి రోజు ఉదయం భోజనానికి మధ్య విరామం ఎక్కువగా ఉంటే గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పు తక్కువేనట. రోజూ పొద్దున, సాయంత్రం భోజనాలు వీలైనంత త్వరగా ముగించేయాలని ఈ అధ్యయనం బల్లగుద్ది మరీ వెల్లడిస్తున్నది. గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజెస్ అధ్యయనం ప్రకారం.. ప్రపంచ ప్రజలమరణాలకు కారణమయ్యే వ్యాధుల్లో గుండె రక్తనాళాల సమస్యలే ముందు వరుసలో ఉన్నాయి.