Hibiscus Flowers Tea | మందార పువ్వులను చాలా మంది దేవుడి పూజ కోసం వినియోగిస్తారు. లేదా ఆ పువ్వులతో ఇంట్లో అలంరరణలు చేస్తారు. అయితే ఆయుర్వేద పరంగా మందార పువ్వులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పువ్వుల్లో ఉండే పోషకాలు మనకు కలిగే పలు వ్యాధులను నయం చేస్తాయని అంటున్నారు. మందార పువ్వుల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రోగాలను తగ్గిస్తాయి. మందార పువ్వుల టీ పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. దీంతో టీ తయారు చేసుకుని తాగితే అనేక లాభాలు ఉంటాయి. ఈ పువ్వుల టీలో ఆంథో సయనిన్స్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి రక్త నాళాలను వెడల్పుగా చేస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
మందార పువ్వుల టీని రోజూ సేవిస్తుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పువ్వుల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఆంథో సయనిన్స్, విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల ఈ పువ్వులతో తయారు చేసిన టీ ని సేవిస్తుంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. శరీరంలోని వాపులు తగ్గుతాయి. తీవ్రమైన, ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ పువ్వుల్లో ఉండే సమ్మేళనాలు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. గుండె పనితీరు మెరుగు పడుతుంది.
మందార పువ్వులు లివర్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఈ పువ్వుల టీని సేవిస్తుంటే లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుంది. లివర్‌లోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు. లివర్ డ్యామేజ్ అవకుండా ఉంటుంది. అధిక బరువును తగ్గించేందుకు కూడా ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు మందార పువ్వుల టీని రోజూ తాగుతుండాలి. దీని వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఈ టీలో డైయురెటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు పోతుంది. దీంతో బరువు తగ్గుతారు. అలాగే షుగర్ లెవల్స్ సైతం నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఈ టీని రోజూ తాగుతుంటే షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
మందార పువ్వుల టీలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు అయిన దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జ్వరం నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. మందార పువ్వుల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇంకా విటమిన్ సి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి చర్మ కణాలను రక్షిస్తాయి. చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. దీంతో చర్మ కాంతి పెరిగి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఈ పువ్వుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చర్మంపై ఉండే వాపులను తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.