ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఇష్టపడే పానీయం.. కాఫీ! రోజును ప్రారంభించాలంటే.. వేడి వేడి కాఫీ ఉండాల్సిందే! ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే దాకా రోజుకు రెండుమూడు కప్పులైనా లాగించాల్సిందే! అయితే.. ఇదంతా సాధారణ మహిళల విషయంలోనే! ‘గర్భధారణ సమయంలోనూ ఇలా కప్పులకు కప్పులు కాఫీని జుర్రేస్తామంటే సమస్యే!’ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబోయే తల్లులు అతిగా కాఫీ తాగడం.. అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు.
కాఫీలో ఉండే ‘కెఫీన్’.. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మితంగా తీసుకుంటే ఫరవాలేదు. ఎక్కువైతేనే ఇబ్బంది. అందులోనూ గర్భధారణ సమయంలో మహిళలు కెఫీన్ను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. కడుపులోని బిడ్డపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందట. కెఫీన్ను సమర్థంగా విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన ఎంజైమ్లు పిండంలో లేకపోవడమే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా.. అధిక మొత్తంలో కెఫీన్ కడుపులో చేరితే, శిశువు మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందట. మెదడు సర్క్యూట్లకు కెఫీన్ అంతరాయం కలిగిస్తుందని న్యూరోఫార్మకాలజీ జర్నల్ పరిశోధనలో తేలింది. ఫలితంగా, భవిష్యత్లో బిడ్డ ఇబ్బందులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. గర్భంలో అధిక స్థాయిలో కెఫీన్ చేరడం వల్ల.. శిశువులకు అటెన్షన్ డిజార్డర్స్, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని మరికొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గర్భాశయంతోపాటు మావిలోని రక్త నాళాలు సంకోచించడానికి కెఫీన్ కారణమవుతుందని పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా, పిండానికి రక్త సరఫరా తగ్గించడంతోపాటు పెరుగుదలనూ నిరోధిస్తుందని హెచ్చరిస్తున్నారు. పిండంలో హార్మోన్లపైనా ప్రభావం చూపుతుందనీ, పుట్టిన తర్వాత పిల్లలు వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఉందనీ అంటున్నారు. ఇక గర్భధారణ సమయంలో.. ప్రశాంతమైన నిద్ర అవసరం. కెఫీన్ను ఎక్కువగా తీసుకుంటే.. నిద్రకు ఆటంకం కలుగుతుంది. నిద్రలేమితో అలసట, ఒత్తిడితోపాటు ఇతర ఇబ్బందులూ కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇలా అయితే.. ఫర్వాలేదు!
కాఫీ తాగే అలవాటును వదులుకోలేని గర్భిణులకు నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్ట్రెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ప్రకారం.. గర్భిణులు రోజుకు 200 మిల్లీగ్రాముల దాకా కెఫీన్ తీసుకోవచ్చని చెబుతున్నారు. అయినప్పటికీ.. కాఫీ రకం, బ్రూయింగ్ పద్ధతిని బట్టి కెఫీన్ పరిమాణం మారుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు. రోజుకు రెండుమూడు కప్పులు కాకుండా.. ఒకటి మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక కాఫీ కప్పు సైజును తగ్గించడం కూడా మంచి ప్రభావం చూపుతుంది. లేకుంటే, కెఫీన్ రహితమైన కాఫీ రకాలతోపాటు గ్రీన్ టీ, హెర్బల్ టీలను ప్రయత్నించాలని చెబుతున్నారు.