Double Chin | శరీరంలో కొవ్వు పెరిగితే లావుగా కనిపిస్తారు. అదే సమయంలో ముఖం కూడా మారిపోతుంది. అప్పటివరకు ఉన్న ఆకర్షణ తగ్గిపోతుంది. చుబుకానికి జతగా మరో గదవ పుట్టుకొస్తుంది. దాంతో వృద్ధాప్య ఛాయలు ఎక్కువవుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు వ్యాయామాలు చేస్తూ ఉంటాం. అయితే, లిప్ పుల్ అప్స్, ఫిష్ లిఫ్, నెక్ కర్ల్ అప్, ఎయిర్ బ్లోయింగ్ వంటి చిన్నచిన్న వ్యాయామాలు చేస్తూనే ఈ నియమాలు కూడా ఫాలో అయితే ముఖంపై కొవ్వు పెరిగి ఏర్పడిన డబుల్ చిన్ దూరమవుతుంది.
తగినంత నీరు శరీరానికి అందితే జీవక్రియ వేగవంతమవుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖంపై పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవాలంటే రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
సలాడ్స్, పండ్లలో ఉప్పు వేసి తింటే ముఖంపై కొవ్వు పెరిగిపోతుంది. ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఉప్పులో ఉండే సోడియం కారణంగా శరీరంలో నీరు చేరుతుంది. దీనివల్ల శరీరం డిటాక్సిఫై అవ్వదు. దీంతో కొవ్వు పేరుకుపోతుంది.
బరువు పెరగడంతోపాటు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ముఖంపై కొవ్వు పెరుగుతుంది. ఆల్కహాల్ వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలో తయారైన విషపూరితమైన పదార్థాలు బయటకు పోవడానికి అవకాశం ఉండదు. ఊబకాయంతోపాటు ఫేస్ ఫ్యాట్ పెరుగుదలకు కూడా ఆల్కహాల్ కారణమవుతుంది.